శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పాపిరెడ్డి పల్లె పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కొంతమేర దెబ్బతిన్నదని.. అందువలన ఆయన అనివార్యమైన పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు వెళ్లాల్సి వచ్చిందని ఆ పార్టీ వారు కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్లే పరిస్థితి లేకుం-డా రోడ్డు మీదే వెళ్లేలా చేసి ఆయనను మార్గమధ్యంలో హత్య చేయడానికి అధికారుల పార్టీ వారు ప్రయత్నించారనేది వారి ఆరోపణ. హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బ తినడం కేవలం వైసీపీ కార్యకర్తల దుడుకుతనం క్రమశిక్షణ లేకుండా హెలికాప్టర్ మీదికి దూసుకురావడం వల్లనే జరిగిందనేది అందరికీ తెలుసు. అయితే నింద మాత్రం కూటమి ప్రభుత్వం మీద వేయడానికి వారు సాహసిస్తూ వచ్చారు.
అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏమిటంటే జగన్ రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్లిపోయిన తర్వాత.. హెలికాప్టర్ ఎంచక్కా ఎగిరి బెంగళూరు వెళ్ళిపోయింది. పైలట్, కో పైలట్ మాత్రమే అందులో వెళ్లారు. వారు వెళ్ళగా లేనిది, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తీసుకు వెళ్ళలేకపోయారు అని దిశగా కూడా ప్రజలకు అనేక సందేహాలు రేకెత్తాయి. విఐపి భద్రత దృష్ట్యా దెబ్బతిన్న హెలికాప్టర్లో ప్రయాణించడం అంత సురక్షితం కాదనే ఉద్దేశంతో మాత్రమే ఆయనను వదిలేసి వెళ్లినట్లుగా పైలట్లు అప్పట్లో వెల్లడించారు. అసలు హెలికాప్టర్ మీద దాడి జరిగిన తీరు దగ్గర నుంచి, ఆరోజు పరిణామాలను కూలంక షంగా నిగ్గుతేల్చేందుకు ఏకంగా పైలట్లకే పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం నాడు వ్యక్తిగతంగా విచారణకు హాజరై ఆరోజు జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరుతున్నారు.
హెలిపాడ్ వద్దకు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ రావద్దని కొన్ని రోజుల ముందు నుంచి పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే పోలీసు నిబంధనలను ఉల్లంఘించడమే తమ ప్రథమ లక్ష్యం అన్నట్లుగా వైసిపి నాయకులు జనాన్ని హెలిపాడ్ వద్దకు తరలించారు. జగన్ వచ్చిన వెంటనే జనం మొత్తం హెలికాప్టర్ మీదికి ఎగబడటం జరిగింది. నియంత్రించబోయిన పోలీసులు మీదకు రాళ్లు రువ్వి వాళ్ళను గాయపరిచారు కూడా. పోలీసులపై దాడికి వైసిపి నాయకులే దగ్గరుండి ప్రోత్సహించారు. జనం దూకుడుగా వచ్చి హెలికాప్టర్‌ను చుట్టుముట్టి ఎగబడటం వల్లనే అది స్వల్పంగా దెబ్బతింది. అప్పటి పరిస్థితుల్లో వాస్తవంగా ఏం జరిగిందో పైలట్, కోపైలట్లు సరైన వివరాలు చెప్పగలరు అని పోలీసులు భావిస్తున్నారు.
హెలికాప్టర్ కి జరిగిన నష్టం ఏ మాత్రం? దాని వలన ప్రయాణ సామర్థ్యం తగ్గుతుందా? అనే సందేహాలను కూడా నివృత్తి చేసుకోనున్నారు. అలాగే ఎవరి కారణంగా అక్కడ పరిస్థితి అదుపు తప్పింది అనే సంగతి కూడా పైలెట్ల విచారణలో తేలే అవకాశం ఉంది.
హెలికాప్టర్ దెబ్బతిన్నదంటూ జరుగుతున్న వైసీపీ ప్రచారంపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్ ను వదిలేసి వెళ్లిపోయిన హెలికాప్టర్ నిర్వహణ సంస్థ ఉండే కర్ణాటక రాష్ట్రంలోని జక్కూరుకు వెళ్లలేదని పోలీసులు సమాచారం సేకరించారు. అదేవిధంగా విండ్ షీల్డ్ దెబ్బతిన్నదని అంటున్న నేపథ్యంలో.. పైలెట్ గాని కో పైలట్ గాని తమ సంస్థ ఉన్నతాధికారులకు ఆ సమాచారం చేరవేయలేదని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉన్నదా అని అనుమానిస్తున్నారు. జగన్ కావాలని రోడ్డు మార్గంలో వెళ్లి.. హెలికాప్టర్ కి నష్టం జరిగేలా పోలీసులు విఫలమయ్యారని, భద్రత గురించి పట్టించుకోలేదని నిందలు వేయడానికే ఇలాంటి స్కెచ్ వేశారని అనుమానిస్తున్నారు. మొత్తానికి బుధవారం నాటి విచారణలో పైలట్ల నుంచి అసలు సంగతులు బయటకు రానున్నాయి.
హెలికాప్టర్ కుట్ర కోణం’ బూమరాంగ్ అవుతుందా?
Sunday, April 27, 2025
