నిమ్మగడ్డ ఆవేదనను కూటమి సర్కారు పట్టించుకుంటుందా?

Friday, December 5, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు.. ఎన్నెన్ని అరాచకాలు చోటు చేసుకున్నాయనడానికి లెక్కేలేదు. కానీ.. ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని ఆయన దుర్మార్గంగా వాడుకుంటూ వ్యవస్థల్ని కూడా ఎంత దారుణంగా ట్రీట్ చేశారో కూడా ప్రజలు గమనించారు. ప్రత్యేకించి.. ఎన్నికల సంఘం అన్నా గానీ, హైకోర్టు అన్నా గానీ కూడా ఎలాంటి ఖాతరులేకుండా జగన్ అప్పట్టో చెలరేగిపోయారు. తన దళాలతో ఆ వ్యవస్థలను నానా బూతులు తిట్టించారు. అప్పటి ఆ తరహా దుర్మార్గాలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అప్పట్లో తనను అసభ్యంగా దూషించిన వైసీపీ మాజీ మంత్రి మీద పోలీసు కేసు పెట్టానని, ప్రభుత్వం మారినా కూడా ఇప్పటిదాకా ఆ కేసు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో నిమ్మగడ్డ ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా అనే చర్చ జరుగుతోంది.

అప్పట్టో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల జగన్ సర్కారు ఎంతో దుర్మార్గంగా వ్యవహరించింది. ఆయనను వేధించింది. ఆయన మీద బురదచల్లి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించింది. ఆయన మీద రకరకాల నిందలు వేస్తూ నీలిప్రచారం సాగించారు. కేవలం కులం కారణంగా.. నిమ్మగడ్డ మీద జగన్ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించడం గమనార్హం.

జగన్ సీఎం అయిన తర్వాత కరోనా వచ్చింది. తొలుత కరోనా చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి చాలా మూర్ఖంగా పట్టుబట్టారు. తాను రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని.. కరోనా ను చాలా తక్కువ చేసి మాట్లాడారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదు. పారాసిటమాల్ వేసుకుంటూ తగ్గిపోతుంది అని గేలిచేసి అభాసుపాలయ్యారు. ఆయన ఎన్నికలు పెట్టాలి అని అన్నప్పుడు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత కరోనా పరిస్థితులు నెమ్మదించిన తర్వాత.. బీహార్ లో క కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఎన్నికలు పెట్టడానికి నిమ్మగడ్డ పూనుకున్నారు. అప్పుడు జగన్ వాటిని వ్యతిరేకించారు. కేవలం నిమ్మగడ్డ మీద ఉన్న ద్వేషమే అందుకు కారణం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉంటే.. ఎన్నికల్లో తాను చేయదలచుకున్న అరాచకాలు సాగవని, తన పప్పులు ఉడకవని భావించారు. ఆయన పదవీవిరమణ జరిగేదాకా ఎన్నికలు జరగకుండా చూడాలని వ్యూహరచనలు చేశారు. రకరకాల పన్నాగాలు పన్నారు. ఆ క్రమంలోనే తన కేబినెట్లోని అదే సామాజిక వర్గానికి చెందిన బూతుల మంత్రి కొడాలి నానిని ప్రయోగించి నిమ్మగడ్డను నానా తిట్లు తిట్టించారు. కొడాలి నాని నోరు తెరిస్తే బూతుల ప్రవాహం అని వేరే చెప్పక్కర్లేదు. ఆయన ఎన్నికల సంఘం కమిషనర్ అనే మర్యాదలేకుండా మాట్లాడడం, రాజకీయ దురుద్దేశాలను ఆపాదించడం చేశారు.ఆ పోకడపై నిమ్మగడ్డ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి పోలీసులు పట్టించుకోకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా తన ఫిర్యాదుకు అతీగతీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంలో దృష్టి సారిస్తారో లేదో చూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles