వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికి.. నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించిన అనేకమంది అధికారులు ఇవాళ కటకటాలు లెక్కిస్తున్నారు. జగన్ కు ఒక్క ఛా న్స్ వచ్చిన సందర్భంలో ఆయనకు సహకరిస్తున్నట్లుగానే పనిచేస్తూ, తమ స్వార్థం కోసం విచ్చలవిడి దందాలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనేకులు ఇవాళ కేసులలో ఇరుక్కుని ఉన్నారు. మూడున్నర వేల కోట్ల రూపాయలను స్వాహా చేసిన లిక్కర్ కుంభకోణంలో గమనిస్తే ఒక ప్రైవేటు వసూళ్ల నెట్వర్క్ దందాల వ్యవహారం నడిపించిన వారందరిదీ ఎంతటి కీలకమైన భూమికో అర్థమవుతుంది. అదే స్థాయిలో దోపిడీకి అనుకూలంగా సరికొత్త లిక్కర్ పాలసీకి రూపకల్పన చేయడం దగ్గర నుంచి, బిగ్ బాస్ కు అంతిమ లబ్ధిదారుగా ముడుపుల సొమ్మును తమ వాహనాలలో తీసుకువెళ్లి అందజేయడం వరకు సహకరించిన సీనియర్ అధికారులు కూడా ఇప్పుడు జైల్లోనే గడుపుతున్నారు.
ఇంతమంది పాత్ర తేటతెల్లం అయిన తర్వాత, వారి జీవితాలు అగమ్య గోచరంగా మారిన తర్వాత.. మరొక సీనియర్ ఐఏఎస్ మాజీ అధికారి పేరు కూడా ఈ స్కామ్ లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చడానికి సిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణం చోటు చేసుకోవడానికి మూలకర్తలుగా నిలిచిన వారిని ఆయా స్థానాల్లోకి తీసుకువచ్చిన ఘనుడు కూడా ఇప్పుడు కేసులో నిందితుల జాబితాలోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం పదవీ విరమణ తర్వాత పూర్తిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సేవలోనే తరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికలకు పూర్వమే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సరికొత్త దోపిడీ మార్గాలను అన్వేషించి అందుకు అనుగుణంగా వ్యవస్థలను మార్చడంలో నిమగ్నం అయ్యారు. కొత్త లిక్కర్ పాలసీని తీసుకురావడం కూడా ఆయన దోపిడీ మార్గాన్వేషణలో భాగమే. లిక్కర్ వ్యాపారంలో తమ కొత్త పాలసీకి అనుగుణంగా తాము చెప్పినట్టుల్లా ఆడడానికి అనుగుణమైన అధికారులు వారికి అవసరం అయ్యారు. వారిలో జగన్ సర్కారు కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి, ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ లు ముఖ్యులు. వీరిద్దరూ ఇప్పుడు ఈ కేసులో ఏ2, ఏ3 గా ఉండడం విశేషం. పాలసీరూప కల్పన దగ్గర నుంచి వసూళ్ల నెట్వర్క్ వరకు అంతా తానై నడిపించిన రాజ్ కేసిరెడ్డి ఏ1 గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే!
అయితే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ అనే అధికారులను ఆయా కీలక పోస్టుల్లోకి సిఫారసు చేసిన వ్యక్తి అప్పట్లో ముఖ్యమంత్రి కి ముఖ్య సలహాదారులుగా ఉన్న అజేయ కల్లం అని తాజాగా సిట్ కోర్టుకు సమర్పించిన రెండో చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకుని వ్యవహారాలను నడిపించడం ద్వారా మాత్రమే వారు అనుకున్నట్లుగా జరిగింది. మూడున్నర వేల కోట్లను కాజేయగలిగారు. వాసుదేవరెడ్డిని కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్ర సర్వీసులోకి డిప్యూటేషన్ పై తీసుకురావడం కూడా అజేయ కల్లం ప్రతిపాదన అనే తెలుస్తోంది. సత్య ప్రసాదును కూడా బేవరేజెస్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా నియమించడంలో అజేయ కల్లంరెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి లేఖ రాసిన తర్వాతే జరిగింది.
ఇలాంటి కీలక పాత్ర పోషించిన అజేయ కల్లం ను కూడా నిందితుల జాబితాలోకి చేర్చి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నియామకాలే కాకుండా స్కామ్ లో ఆయన మిగిలిన పాత్రను, ఆయనకు దక్కిన వాటాను కూడా నిర్ధారించవలసి ఉందని సిట్ పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఆయన పేరు నిందితులు జాబితాలో చేర్చడానికి అవసరమైన కసరత్తులో వారు ఉన్నారు. మరి ఇంకా కొత్తగా జగన్ దెబ్బకు బలయ్యే అధికారులు ఎందరున్నారో వేచి చూడాలి!
