జగన్ ప్రభుత్వ కాలంనాటి అనేకానేక వ్యవహారాలు, నేరాలకు సంబంధించి వాటితో సంబంధం ఉన్న అనేకమందిపై ఇప్పుడు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. మంత్రులుగా పనిచేసిన సీనియర్లు సహా అనేకమంది పోలీసు విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. నోటీసులు ఇచ్చినప్పుడు స్పందిస్తున్నారు. విచారణకు రమ్మని పిలిచిన ప్రతి సందర్భంలోనూ ఆయా స్టేషన్లకు వెళుతున్నారు. తమ వాదన ఏమిటో చెబుతున్నారు. అయితే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్థాయిలో పెడసరంగా ప్రవర్తించిన వారు వైసీపీ దళాలలో కూడా ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు.
రాంగోపాల్ వర్మ పెట్టిన మార్ఫింగ్ అసభ్య పోస్టులకు సంబంధించి ఆయనకు చాలా కాలం కిందటే పోలీసులు 41ఏ నోటీసులు సర్వ్ చేశారు. ఈనెల 19న విచారణకు వెళ్లాల్సి ఉండగా.. ఆయన ఎగ్గొట్టారు. నాలుగురోజుల గడువు అడిగారు. 25న విచారణకు రావాలని 20న పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. ఇప్పటిదాకా మిన్నకుండిపోయిన వర్మ.. తాజాగా తనకు ఇంకో రెండు వారాల గడువు కావాలంటూ న్యాయవాది ద్వారా సమాచారం పంపడం గమనార్హం.
ఆయన తీరుతో విసిగిపోయిన పోలీసులు ఏకంగా హైదరాబాదులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు గానీ.. రాంగోపాల్ వర్మ ఇంట్లో లేకుండా అదృశ్యం అయ్యారు. ఆయనకు ముందే ఫిక్సయిన షెడ్యూళ్ల కారణంగా ఇవాళ విచారణకు వెళ్లలేదని, ఎవ్వరికైనా సరే గడువు అడిగే హక్కు ఉంటుందని న్యాయవాది చెబుతున్నారు. నిజమేగానీ.. అంత ముందే ఫిక్సయిన షెడ్యూళ్లు ఉన్నప్పుడు 19న విచారణకు వెళ్లకుండా నాలుగురోజుల గడువుమాత్రమే ఎందుకు అడిగినట్టు? అప్పుడే మూడు వారాల గడువు అడిగిఉంటే బాగుండేది కదా.. అనేది ప్రజల సందేహం!
రాంగోపాల్ వర్మ కోయంబత్తూరు ఎయిర్ పోర్ట్ లో ఉన్నట్టుగా ఒక ట్వీట్ పెడుతూ పోలీసులను మిస్ లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన హైదరాబాదులోనే తలదాచుకుని ఉన్నారని వినిపిస్తోంది. అయినా.. ముందే ఫిక్సయిన రాచకార్యాలు రాంగోపాల్ వర్మకు మాత్రమే ఉంటాయా.., పోలీసులు పిలిచినప్పుడెల్లా విచారణకు హాజరవుతున్న వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు మరీ అంత ఖాళీగా కూర్చొనే వారిలా ఉన్నారా? అనే ప్ర;శ్నలు వస్తున్నాయి. రాంగోపాల్ వర్మ బుకాయింపులు మాని.. పోలీసు విచారణకు సహకరించకపోతే ఇబ్బంది పడతారని నిపుణులు అంటున్నారు.