రాముడికి లక్ష్మణుడు గుడ్ బై కొట్టనున్నారా?

Thursday, November 21, 2024

‘‘రామాయణంలో రాముడి అడుగులో లక్ష్మణుడు ఎలా అడుగు వేశాడో.. అలాగే వైఎస్ జగన్ కు నేను’’ అంటూ ఆయన పలువేదికల మీద నుంచి బహిరంగంగానే ప్రకటించారు. ఆయన వలన తనకు నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పడం లేదని మరొక ఎమ్మెల్యే వచ్చి మొరపెట్టుకుంటే.. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా.. ‘ఆయన మనకు చాలా ముఖ్యమైన నేత.

మీరే సర్దుకుపోవాలి’ అని చెప్పిపంపారు. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి తన అనుచరులను పోగేసుకొని స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాసం మీదికి దండెత్తి వెళ్లిపోయి ఆయన విధ్వంసం సృష్టించారు. అలాంటి జోగి రమేశ్ ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన తెలుగుదేశం గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారని కూడా తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన జోగి రమేశ్ ఇప్పుడు రాజకీయంగా అనేక కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబునాయుడు ఇంటిమీదకు దాడిచేసిన కేసు ఆయన మీద గట్టిగానే ఉంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. మరొకవైపు అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన కేసులు ఆయన తమ్ముడు, కొడుకు మీద ఉన్నాయి. రాజకీయ అధికారం కూడా లేదు. తాను నమ్ముకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏదో ఒకనాటికి గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం కలగడం లేదు.

ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆస్తులను చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు తప్ప.. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇలాంటి వాతావరణం మధ్య ఆ పార్టీలో కొనసాగడం అనేది శ్రేయస్కరం అని ఆయనకు అనిపించడం లేదు. అందుకే జగన్ రాముడైతే.. తాను లక్ష్మణుడిని అని చెప్పుకున్న జోగి రమేశ్.. చివరకు రాముడికి గుడ్ బై కొట్టేసి తన దారి తాను చూసుకోవాలని అనుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రబలంగా వినిపిస్తోంది.

చంద్రబాబు నివాసంపై దాడి కేసుల విచారణ ప్రారంభమైన నాటినుంచి జోగి రమేశ్ కాస్త నిర్లిప్తంగానే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ కేసులను ఎదుర్కోవడంలో వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి నాయకులు ఒక ముఠాగా ఏర్పడి ముందుకెళుతున్నారని, తన గురించి పట్టించుకోవడం లేదనే భావన కూడా ఆయనలో ఉన్నట్టుంది. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

వైసీపీకి రాజీనామా చేసి ఎన్డీయే కూటమి పార్టీల్లో చేరాలని అనుకుంటున్నారుట. ప్రస్తుతానికి తెలుగుదేశంలో చేరుతారనే మాట స్థానికంగా వినిపిస్తోంది. అయితే ఆయన చేరిక గురించి తమ పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత గానీ.. చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోవచ్చునని కూడా అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles