‘పులివెందుల నియోజకవర్గం తమ కుటుంబానికి పెట్టని కోట’ అని వైయస్ జగన్మోహన్ రెడ్డి రొమ్ము విరుచుకొని చెప్పవచ్చు గాక. కానీ ఆ మాటలోనే ఆయనకు గండం కూడా పొంచి ఉన్నదా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. పులివెందుల నియోజకవర్గం గురించి జగన్ ఎంత ఘాటుగా తన బలాన్ని చాటుకున్నప్పటికీ అక్కడ అది చాలావరకు సన్నగిల్లింది- అనే మాట వాస్తవం. ఇటీవల పులివెందుల రూరల్ మండలం జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో పతనమైన ప్రాభవాన్ని సూచిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 2029 లో రాబోయే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో జగన్ పరిస్థితి ఏమిటి? ఆశామాషీ అభ్యర్థులు కాకుండా గట్టిగా తలపడగల ప్రత్యర్థి ఎదురైతే ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం సాధ్యమవుతుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్ సొంత మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి తన మామయ్య మీద తొడ కొట్టి బరిలోకి దిగవచ్చునని ఊహాగానాలు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జగన్ చెల్లెలి వైయస్ షర్మిల సారధిగా ఉన్నారు. ఆమె ఉల్లి రైతుల కష్టాలు వినేందుకు, వారికి సరైన పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు సోమవారం ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన వెంట కొడుకు వైయస్ రాజారెడ్డి ని కూడా అని తీసుకువచ్చారు. షర్మిల పర్యటనలో ఆసక్తికరమైన వ్యక్తిగా కనిపించిన కొడుకు వైయస్ రాజారెడ్డి గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు- వైయస్ షర్మిల అందుకు జవాబు ఇచ్చారు. ‘‘అవసరమైనప్పుడు నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోకి వస్తారు’’ అని ఆమె వెల్లడించారు. అంతే అక్కడితో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
పులివెందుల నియోజకవర్గం అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట అని వారు అనుకుంటూ ఉండవచ్చు. కానీ అదే కోటలో నుంచి మామాఅల్లుళ్ళు తలపడితే ఎలా ఉంటుంది అనే అంచనాలు ఇప్పుడే మొదలయ్యాయి. వైయస్ రాజారెడ్డి అంటే అది రాజశేఖర్ రెడ్డి తండ్రి పేరు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి తన తాతయ్య అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు అని వారి కుటుంబం గురించి తెలిసిన అందరూ చెబుతుంటారు. షర్మిలకు కూడా తాతయ్య పట్ల అంతే ప్రేమ ఉందని అనుకోవాలి. అందుకే ఆమె తన కుమారుడికి తాతయ్య పూర్తి పేరును వైయస్ రాజారెడ్డి అని ఇంటి పేరుతో సహా పెట్టుకున్నారు.
అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పులివెందుల గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి నాలుగోతరంగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డిని ఏకంగా పులివెందుల ఎమ్మెల్యేగా తన తండ్రికి వారసుడిగా తయారు చేయాలని వైయస్ షర్మిల కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
జగన్ మామయ్యపై మేనల్లుడు తొడ కొడతాడా?
Thursday, December 4, 2025
