వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి దురహంకారంతో కూడిన వ్యక్తి.. ఎంతటి నిర్దాక్షిణ్యంతో కూడిన వ్యక్తి అనేది తాజా పరిణామాలు.. రాష్ట్ర ప్రజలకు చాలా బాగా తెలియజెబుతున్నాయి. ఒకటి కాదు రెండు సంఘటనలు.. ప్రజలంటే ఆయనకు ఉన్న చులకన భావాన్ని, ఆయనలోని పెత్తందారీ దురహంకార బుద్ధులను ప్రజలకు విశదపరుస్తున్నాయి. తన రెంటపాళ్ల యాత్ర కారణంగా.. ఇద్దరు దుర్మరణం పాలైతే, అందులో ఒకరైన సింగయ్య తాను ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి నలిగిపోతే.. కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా జగన్ ముందుకు రాలేదు. ఆయన దళాలు మొత్తం ప్రమాదాలు జరగకుండా ఉంటాయా.. అని అడ్డంగా వాదిస్తున్నారు. ఒకవేళ వారే కరెక్టు అని కూడా అనుకుందాం. ప్రమాదమే జరిగిందని కూడా అనుకుందాం. కానీ ఆ ప్రమాదంలో మరణించినందుకు క్షమాపణ చెబితే.. నాయకుడి ఔన్నత్యం బయటపడుతుంది కదా! ఆ మాట చెప్పకపోవడం ఆయనలోని దుర్మార్గానికి మచ్చుతునక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి జగన్ లోని దురహంకారాన్ని తెలియజెప్పడంలో ఇది రెండో ఉదాహరణ. ఎందుకంటే.. సాక్షి ఛానెల్లో డిబేట్ సందర్భంగా అమరావతిని వేశ్యల రాజధాని అని ఒక గెస్టు పేనలిస్టు వ్యాఖ్యానించిన విషయంలో కూడా జగన్ బెల్లం కొట్టిన రాయిలా మౌనం వహించారు. వ్యాఖ్యలు ఆ డిబేట్లో వచ్చినందుకు నిజానికి యాంకర్ కేఎస్సార్ తోపాటు, సాక్షి ఛానెల్ మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. ఆ వ్యాఖ్యలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని అవి ఒక గెస్టు చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, అవి ఆయన వ్యక్తిగతం అని ఆ వర్గం మొత్తం దబాయిచండానికి ప్రయత్నించింది.
నిజమే కావొచ్చు. కానీ.. తమ ఛానెల్ ద్వారా.. ఆ గెస్టు అలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేసినందుకు.. అలాంటి వ్యక్తికి వేదిక కల్పించినందుకు, తమ ప్రమేయం లేకపోయినప్పటికీ.. అమరావతి మహిళలు, రాష్ట్ర మహిళలు ఆ వ్యాఖ్యలతో వేదనకు గురైనందుకు.. తమ వంతుగా క్షమాపణ చెప్పి ఉంటే తప్పేం కాదు. సాక్షి మీడియా యజమాని వైఎస్ భారతి గానీ, వైఎస్ జగన్ గానీ.. పొరబాట్న కూడా సారీ చెప్పలేదు. చివరికి డిబేట్ షో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా.. ప్రజల ఆందోళన వల్ల, విమర్శల వల్ల తన యజమానులు నొచ్చుకుని ఉంటారేమో అని చింతించి, వైఎస్ భారతికి జగన్ కు క్షమాపణలు చెప్పారే తప్ప.. అంతగా ఆవేదనచెందిన రాష్ట్ర మహిళలకు ఆయన నోటితో సారీ చెప్పనేలేదు. అలా తమ లేకితనాన్ని, అహంకారాన్ని వారంతా ప్రదర్శించుకున్నారు.
ఇప్పుడు తన కారు కింద తన అభిమానే పడి మరణిస్తే.. మరొకడు కూడా తన యాత్రలో చనిపోతే.. కనీసం ఆ కుటుంబాలను క్షమాపణ కూడా అడగకుండా జగన్మోహన్ రెడ్డి.. అత్యంత దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది.
