వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఎవరో ఆకతాయి రాయి విసిరాడు సరే.. ఆయనకు అయిన గాయం ఎంత? అలాంటి గాయానికి ఎన్నిరోజుల విశ్రాంతి కావాలి? ఎన్నిరోజులకు ఆ గాయం పూర్తిగా మానిపోతుంది? ఎవరికైనా అంచనా ఉందా? సామాన్య ప్రజలకు ఉండే అవగాహన ప్రకారం.. ఆ గాయం ఎప్పటికి మానుతుందనేది తర్వాతి సంగతి. కానీ వైఎస్ జగన్ కు మాత్రం మేనెల 11 వ తేదీ దాకా ఆ గాయం తగ్గుముఖం పట్టే అవకాశం లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఒక్కరోజులో బ్యాండేజీ తీసేస్తే ఆరిపోయేగాయానికి జగన్ ఇంకా.. నుదుటి మీద పెద్ద బ్యాండేజీతో డ్రామా నడిపిస్తున్నారనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఉండగా జగన్మోహన్ రెడ్డి మీద ఆకతాయి ఈనెల 13 వ తేదీన రాయి విసిరాడు. ఆయన నుదుటిమీద తగిలినరాయి అటునుంచి వెళ్లి వెలంపల్లి కంటికి కూడా తగిలింది. ఇద్దరూ గాయపడ్డారు. జగన్ కు నుదుటి మీద ఒక సెంటిమీటరు పొడవున గాయమై రక్తస్రావం అయింది. బస్సులో ప్రథమ చికిత్స చేయించుకున్న జగన్, బసకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అక్కడ రెండు కుట్లు కూడా వేయించుకున్నారు.
మామూలుగా అయితే మన ఇళ్లలో పిల్లలకు, పెద్దలకు కూడా ఆ మాత్రం గాయాలు తరచూ అవుతూనే ఉంటాయి. పిల్లలు ఆడుకుంటూ కిందపడ్డప్పుడు, సైకిలు నేర్చుకుంటూ పడ్డప్పుడు ఇంతకంటె పెద్దగాయాలే అవుతాయి. పిల్లల గురించి అతిగా ఆలోచించే తల్లిదండ్రులు డాక్టరు దగ్గరకు తీసుకెళ్తే ఓ ఇంజక్షను చేస్తారు. గాయం పెద్దదిగా అనిపిస్తే.. లోకల్ అనస్తీషియా ఇచ్చి రెండు కుట్లు వేసి పంపేస్తారు. అలాగే కుర్చీలో కూర్చోబెట్టి డాక్టరు కుట్లు వేసేసినా కూడా ఆశ్చర్యం లేదు. అంత సింపుల్ గాయం అది. కాస్త మొండి తల్లిదండ్రులైతే.. ఆటల్లో అలాంటి దెబ్బ తగిలించుకున్నందుకు పిల్లల్ని నాలుగు పీకి, గాయం మీద కాస్త పసుపు పొడి అద్ది వదిలేస్తారు. రెండోరోజుకు అంతా సర్దుకుని గాయం మానుతుంది.
కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూటే సెపరేటు. ఆయనకు గాయమై పదిరోజులు దాటినా.. ఇంకా నుదుటిమీద బ్యాండేజీ మాత్రం తీయలేదు. ఆ బ్యాండేజీ లేకపోతే.. తనమీద రాయితో హత్యాయత్నం జరిగిన సంగతిని ప్రజలు మర్చిపోతారేమో.. సానుభూతిని మిస్సవుతానేమో అని ఆయన భయపడుతున్నట్టుగా ఉంది. కుట్లు కూడా వేసిన తర్వాత ఒక్కరోజులో మానిపోయే గాయానికి జగన్ బ్యాండేజీని మాత్రం మే 11వ తేదీ దాకా, అంటే ఎన్నికల ప్రచారం గడువు ముగిసే దాకా కొనసాగించేలా ఉన్నారని జనం నవ్వుకుంటున్నారు. ఆయన ఎంత ఎక్కువ కాలం బ్యాండేజీ కొనసాగిస్తే.. అంతగా అది సానుభూతి కోసం ఆడుతున్న డ్రామాగా ప్రజల్లో ముద్రపడే అవకాశం ఉంది.
మే11 దాకా జగన్ బ్యాండేజీ విప్పడా?
Friday, November 22, 2024