జగన్మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీనుంచి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి యూరోప్ యాత్రకు వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎన్నికల ఒత్తిడిని భరించిన జగన్మోహన్రెడ్డి ఆ పర్వం పూర్తయిన తర్వాత.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి విదేశాలకు విహార యాత్రకు వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి అడిగారు. అక్రమార్జనలు, మనీ లాండరింగ్ కేసుల్లో ప్రధాన నిందితుడు అయిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. దాంతో ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఆయన దరఖాస్తు చేసుకోగా, సీబీఐ మాత్రం అభ్యంతరం వెలిబుచ్చింది. వారి అభ్యంతరాలను పక్కన పెట్టి కోర్టు ఆయన వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.
కాగా, రాష్ట్రంలో పోలింగు ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నాయకుల మీద దాడులకు హత్యాయత్నాలకు తన పార్టీ వారిని ఎగదోసి.. ఆ అగ్నికీలలు జ్వలిస్తూ ఉండగా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంచక్కా యూరోపు దేశాలకు విహారయాత్ర వెళ్లదలచుకుంటున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో పలుచోట్ల శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళి తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉందనే వార్తలు రావడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారికి ఈ పోలింగ్ సరళి అనూహ్యంగా తోస్తోంది. మళ్లీ తామే గెలుస్తాం.. ఇంకా చెలరేగిపోతాం అనుకున్న వారికి ప్రజల స్పందన జగన్ ను పదవీచ్యుతుడిని చేయబోతున్నదని తెలిసి సహించలేకపోతున్నారు.
సాధారణంగా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పోలింగ్ నాడు అల్లర్లు జరుగుతాయి. ఈ సోమవారం కూడా పలుచోట్ల అలాంటి దుర్ఘటనలు జరిగాయి. కానీ పోలింగ్ పర్వం మొత్తం ముగిసిపోయిన తర్వాత.. ఓటమి గురించిన పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల్లో అసహనం మరింతగా పెరిగిపోయింది. మంగళవారం నాడు మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం వారిపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు విచ్చలవిడిగా రెచ్చిపోవాల్సిందిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా పరిస్థితి ఉంది. ఒకవైపు బొత్స సత్యనారాయణ మేం చాలా సంయమనం పాటించమని కార్యకర్తలకు చెబుతున్నాం, ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామంటే వాళ్లంతా క్లోజ్.. అని హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా ఇక్కడ అగ్గిని రాజేసి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో విహారయాత్రకు వెళుతున్నారా? అని పలువురుప్రశ్నిస్తున్నారు.