జగన్మోహన్ రెడ్డి మాటలను కొంచెం జాగ్రత్తగా గమనించండి. రాష్ట్రంలో ఆయన ప్రభుత్వ హయాంలో కొత్తగా అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరికీ కూడా భయం పుట్టేలా ఆ మాటలు ఉంటున్నాయి. సొంత చెల్లెలు వైయస్ షర్మిలకు ఎంఓయు ద్వారా రాసిచ్చిన ఆస్తులను ఇప్పుడు వెనక్కు తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ లో కేసు వేశారు. అలాంటి నిర్ణయానికి ఆయన చెబుతున్న కారణాలు ఏంటో జాగ్రత్తగా గమనించండి. చెల్లెలు గనుక ఆమెతో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కనుక 200 కోట్ల రూపాయల డబ్బు కూడా ఇచ్చానని, ఆస్తులలో వాటాలు కూడా ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. ఇప్పుడు చెల్లెలిలో ప్రేమ ఆప్యాయతలు కనిపించడం లేదని.. ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. తనను నిందిస్తున్నారని.. అందువల్ల తన ఆస్తులు తాను తిరిగి తీసుకుంటానని చెబుతున్నారు. ఒకవేళ తనను, అవినాష్ రెడ్డిని, భారతిని ఎప్పటికీ విమర్శించకుండా ఉండేటట్లయితే మళ్లీ ఆలోచిస్తానని కూడా మెలిక పెడుతున్నారు. ఈ మాటలన్నింటి మధ్యలో ‘‘ప్రేమ ఆప్యాయత’’ అనే పదాలు ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి!
ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పదాలనే జపిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో కోట్ల మందికి తాను సంక్షేమ పథకాలు అమలు చేశానని వారందరి ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయని ఆయన పదేపదే ప్రస్తావించారు. పెన్షన్లు తీసుకున్న అవ్వ తాతల ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయి? రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయి? అంటూ తన సంక్షేమ పథకాలు అమలు చేసిన కేటగిరీల వారీగా ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావించి వారి ప్రేమ ఆప్యాయతలు ఏమైపోయాయి అని జగన్ బహుముఖాలుగా ఆవేదన చెందారు!
ఈరోజున తన చెల్లెలులో ప్రేమ ఆప్యాయతలు లేకుండా పోయాయి కాబట్టి ఆమెకు ఇచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని ఆయన అడుగుతున్నారు. 200 కోట్ల రూపాయలు నగదు కూడా ఇచ్చినట్టుగా సరైన ఆధారాలు లేవేమో.. లేకపోతే ఆ డబ్బును కూడా వెనక్కి అడిగేవారు అని ప్రజల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల విషయంలో ఇచ్చిన డబ్బుకు ఆధారాలు లేకపోవచ్చు కానీ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయంలో జగన్ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఎంతెంత సొమ్ము ముట్టిందో ఆయన వద్ద లెక్క ఉంది. వీళ్ళందరూ ప్రేమ ఆప్యాయతలు చూపించలేదు కాబట్టి తనకు ఓటు వేయలేదు కాబట్టి.. తనను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి.. వీరికి ఇచ్చిన సంక్షేమ పథకాల డబ్బు మొత్తం తిరిగి తనకు ఇచ్చేయాలని జగన్ అడిగినా అడగగలరు. అంతటి చాతుర్యం ఆయనకు ఉన్నది అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు. ‘‘ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయాయి కనుక నీకు ఇచ్చింది తిరిగి ఇచ్చేయ్’’ అని అడగడం చవకబారు ఎత్తుగడగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది!
రాష్ట్ర ప్రజలపై కూడా జగన్ కేసు వేస్తాడేమో?
Wednesday, January 22, 2025