జగన్ ప్రెస్‌మీట్ లో మాట్లాడ్డం ఎప్పటికి నేర్చుకుంటారో?

Friday, December 5, 2025

రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పసిబాలుడు అని అనుకోవడానికి వీల్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ఆయన ఎంపీగా గెలిచి పార్లమెంటులో సేవలందించారు. ఆతర్వాత సొంత పార్టీ పెట్టుకుని.. ఆ పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చారు. ఓదార్పు యాత్రలు లేదా వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల రూపేణా రాష్ట్రంలో కొన్ని వేల సభలు ఆయన నిర్వహించి ఉంటారు. ఒక దఫా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయిదేళ్లు పాలన సాగించారు. తర్వాత అత్యంత ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని ఎమ్మెల్యేగా మిగిలారు. కానీ.. ఇప్పటికీ ఆయనకు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో చేతకావడం లేదు. విజ్ఞత, విచక్షణ లేకుండా ఆయన ప్రెస్ మీట్లు సాగిపోతున్నాయి.

సాధారణంగా చిన్న అయిదు నిమిషాల ప్రెస్ మీట్ పెట్టినా కూడా.. చేతిలో తన వందిమాగధులు తయారుచేసిన స్క్రిప్టు ఉన్న కాగితం పట్టుకుని.. గడియగడియకు దానిని చూసుకుంటూ ఒక్కో పదాన్నీ కూడబలుక్కుంటున్నట్టుగా చదవడం జగన్ అలవాటు. ఆయనకు తెలుగు సరిగా రాదేమో లేదా.. ఒకటే ఫ్లోలో మాట్లాడడం చేతకాదేమో.. సబ్జెక్టులు మర్చిపోకుండా ఉండడానికి కాగితం చూసుకుంటూ ఉంటాడేమో అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ.. అంతకంటె ఘోరంగా ఆయన ప్రెస్ మీట్లు సాగుతున్నాయి. విచక్షణ లేని జగన్ ఒక అంశం మీద ప్రెస్మీట్ పెట్టి.. అందులో చంద్రబాబునాయుడును తిట్టడానికి తాను అలవాటుగా నేర్చుకున్న వంద విషయాలను కలిపేయడానికి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది చాలా తమాషాగా ఉంటోంది. ఎంత తమాషాగా ఉంటున్నదంటే.. ఆయన ఒక తాజా అంశం మీద ప్రెస్ మీట్ పెడితే.. ఆ అంశం మీద లోతులకు వెళ్లి మాట్లాడాలి. కానీ జగన్ కు అది చేతకాదు. ఆయనకు ప్రసంగాలు రాసి ఇచ్చే వందిమాగధులకు కూడా చేతకాదు. జగన్ ఒకే మాటను వందసార్లు మాట్లాడుతుంటారు. అలాగే ఒక ప్రెస్ మీట్లో వంద విషయాలు మాట్లాడాలని కూడా అనుకుంటారు. అందులో 99 విషయాలు అప్పటికే అనేకసార్లు మాట్లాడిన పాచివిషయాలే అయి ఉంటాయి. అలా మాట్లాడ్డం వల్ల తాజాగా మాట్లాడదలచుకన్న సమస్య మీదికి ఎవ్వరి ఫోకస్ వెళ్లకుండా డైల్యూట్ అయిపోతుంటుంది. అందుకే.. జగన్ అసలు ప్రెస్ మీట్లో మాట్లాడ్డం ఎప్పటికి నేర్చుకుంటాడో కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఉదాహరణకు.. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ హారిక దంపతుల కారును తెలుగుదేశం వారు అడ్డుకుని నిలదీయడం జరిగింది. అక్కడికేదో మహాపరాధం జరిగిపోయినట్టుగా ఒక బీసీమహిళను దూషిస్తారా.. అంటూ కులం కార్డు ప్లే చేయడానికి జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ అంశం మీద రెండు నిమిషాలైనా నికరంగా మాట్లాడనే లేదు. పోలీసులను బోలెడంత సేపు దూషించారు. సూపర్ సిక్స్ హామీల దగ్గరకు వెళ్లిపోయారు. నాకు భద్రత కల్పించడం లేదు మొర్రో అంటూ మొత్తుకున్నారు. తన యాత్రలు చూసి భయపడుతున్నారంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు. ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం అంటూ స్టార్ట్ చేశారు. ఏ సబ్జెక్టు మీద ప్రెస్ మీట్ పెట్టాడో ఆయన మర్చిపోవడం కాదు.. ప్రెస్ వాళ్లు కూడా మర్చిపోయేలా గందరగోళం చేసేశారు. మరి జగన్ అసలు ప్రెస్ మీట్ లో మాట్లాడ్డం ఎప్పటికి నేర్చుకుంటారో కదా.. అని విలేకర్లుముక్కున వేలేసుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles