రెంటికి చెడ్డ రేవడి అనే ఒక సామెత ఉంటుంది. స్పష్టమైన నిర్ణయం సకాలంలో తీసుకోకుండా గోడమీద పిల్లిలాగా వ్యవహరించే వారు.. అటుకు చెందకుండా- ఇటుకు చెందకుండా నష్టోయే సందర్భాలలో ఈ సామెత వాడుతారు. ఇప్పుడు రాజకీయంగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అచ్చం ఆ సామెతకు తగ్గట్టుగానే కనిపిస్తున్నది. దేశంలో డీలిమిటేషన్ అనే వ్యవహారం ఆయన దుర్బలత్వాన్ని బయటపెడుతున్నది. ఎందుకంటే.. ఆయన ఎన్డీయే కూటమిలో భాగమైన పార్టీ అధినేత కాదు. అలాగేని ఎన్డీయేతర పార్టీలన్నీ కలిపి.. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగుతున్నదని గళమెత్తి నినదిస్తోంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను కూడా వారితో గళం కలపలేకపోతున్నారు. ఇండియా కూటమిలో భాగం కావాల్సిన అవసరం లేదు.. కానీ దక్షిణాదికి జరుగుతున్న నష్టాన్ని వివరించడంలో.. అందరితో కలవలేకపోయినప్పుడు.. ఆయనకు నష్టమే తప్ప లాభం ఉండదని విశ్లేషకుల అంచనాగా ఉంది.
డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలనే డిమాండుతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు ఈ బేటీకి హాజరయ్యారు. ఏపీలో అధికారం ఎన్డీయే చేతిలోనే ఉన్నది గనుక అధికార కూటమి నుంచి ఎవ్వరూ వెళ్లరు. కానీ.. అక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చాలా గౌరవప్రదంగా పార్టీ దూత ద్వారా ఆహ్వానం పంపారు స్టాలిన్. కానీ.. జగన్ ఆ సమావేశానికి వెళ్లనేలేదు.
స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి వెళ్లినంత మాత్రాన.. ఎన్డీయే కూటిమికి వ్యతిరేకం అయిన ఇండియా కూటమిలో భాగమైనట్టుగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రతినిత్యం కత్తులు దూస్తున్న భారత రాష్ట్ర సమితి తరఫున కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా హాజరై ఉంటే.. చాలా గౌరవంగా ఉండేది. ఆయనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు.. ఆయనకు మద్దతిచ్చే ఇతర పార్టీలు ఒకటో రెండో ఉండేవి. అలాకాకుండా.. జగన్ భేటీకి వెళ్లకుండా కేవలం ప్రధానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు.
భేటీకి వెళ్లకపోవడం వలన.. మోడీ తన పట్ల ప్రసన్నంగా ఉంటారని జగన్ కలగంటున్నారేమో తెలియదు. ఏపీలోని అధికార కూటమికి ఆయన శత్రువే. ఏపీలో ఎన్డీయే బంధం ఇప్పట్లో మసకబారేది కాదు. వారి బంధం చాలా స్ట్రాంగుగా ఉంది. జగన్ కు అలాంటి కలలు ఉంటే మరచిపోవచ్చు. అలాగని.. ఆయన ఎన్డీయే వ్యతిరేక పార్టీలతో కూడా స్నేహంగా ఉండకుండా.. దూరంగా మెలగితే.. చేటు తప్పదు. అందుకే జగన్ తన తప్పుడు నిర్ణయాలతో ఎటూకాకుండా పోతారేమోనని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
జగన్.. రెంటికి చెడ్డ రేవడి అవుతారా?
Tuesday, March 25, 2025
