ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు అందరికంటె ఆలస్యంగా ఎన్నికల సమరాంగణంలోకి ప్రవేశించిన నాయకుడు రఘురామక్రిష్ణరాజు. ఏ పార్టీ నుంచి అయినా సరే.. నరసాపురం ఎంపీగా మాత్రమే పోటీచేయాలనే తలంపుతో ఉన్నటువంటి రఘురామక్రిష్ణరాజు, అక్కడ అవకాశం దొరక్కపోవడంతో.. సుదీర్ఘమైన ప్రయత్నాలు, నిరీక్షణ తర్వాత ఉండి ఎమ్మెల్యే టికెట్ ను తెలుగుదేశం తరఫున దక్కించుకున్నారు. అప్పటికే అక్కడ తెదేపా అభ్యర్థిని ప్రకటించేసి.. ఆయన ప్రచారపర్వంలో చాలా దూసుకెళ్లిపోయిన తర్వాత.. చంద్రబాబు బుజ్జగించి రఘురామక్రిష్ణరాజు కోసం ఆ టికెట్ కేటాయించారు. అంత ఆలస్యంగా ఎన్నికల్లోకి వచ్చిన ఈ నాయకుడు.. గెలిచిన తర్వాత తన కలను నెరవేర్చుకోబోతున్నారా? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.
రఘురామక్రిష్ణరాజుకు నిజానికి ఎంపీ పదవి మీదనే మోజు ఉండేది. మూడు పార్టీల పొత్తులు ఏర్పడక ముందునుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్పేవారు. ‘‘మూడు పార్టీల పొత్తు కుదరడం తథ్యం. పొత్తుల్లో భాగంగా.. నరసాపురం ఎంపీ స్థానం ఏ పార్టీకి దక్కినా సరే.. అక్కడినుంచి ఎంపీగా పోటీచేయబోయేది మాత్రం నేనే’’ అని చెప్పుకునే వారు. కానీ భాజపాకు ఆ సీటు దక్కిన తర్వాత ఆయనను పట్టించుకోలేదు. ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు తనకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని మాత్రం వ్యక్తం చేశారు.
ఆయనకు నరసాపురం టికెట్ ఇప్పించడానికి భాజపా పెద్దలతో మరోమారు ప్రత్యేకంగా మంతనాలు సాగించిన చంద్రబాబు వీలుపడక, చివరికి ఉండి నుంచి అప్పటికే ప్రకటించిన అభ్యర్థిని తప్పించి, ఆ సీటు రఘురామకు ఇచ్చారు. అక్కడ ఆయన ఘనమైన మెజారిటీతో గెలిచారు కూడా.
అయితే చంద్రబాబును ఎమ్మెల్యే టికెట్ కోసమైనా ఆశ్రయిస్తున్న తరుణంలో రఘురామ ఒక కోరికను వెలిబుచ్చారు. ఏపీ అసెంబ్లీకి తాను స్పీకరుగా పనిచేయాలని ఉన్నదని అన్నారు. తన మిత్రులు కూడా చాలా మంది.. తాను స్పీకరుగా ఉంటే చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఆయన ఉండిలో ఘనవిజయం సాధించడంతో పాటు, ఎన్డీయే కూటమి కూడా ఘనంగా గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న తరుణంలో చంద్రబాబునాయుడు ఆయన కోరికను తీరుస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. సాధారణంగా మంత్రిపదవులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. స్పీకరుపదవికి పోటీ అంతగా ఉండదు గనుక.. రఘురామకు సభాసారథ్యం దక్కినా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.
ఉండి హీరో రఘురామ కల నెరవేరుతుందా?
Wednesday, November 13, 2024