వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2019 అధికారంలోకి తీసుకువచ్చిన పరిణామాలల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా ఒకటి. తన బాబాయిని చంపేశారంటూ ఆయన కన్నీళ్లు కార్చి.. మొత్తానికి అధికారం దక్కించుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా విచారణలో వెలుగుచూసే విషయాలన్నీ రకరకాలుగా మారుతూ వచ్చాయి. అనుమానాలు ఆయన మీదనే ప్రసరించే దశ వచ్చింది. ఆయన అత్యంత ప్రేమగా చూసుకునే తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి.. హత్య వెనుక అసలు సూత్రధారిగా విస్తృతంగా వార్తలు వచ్చాయి.
వైఎస్ భాస్కర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి అందరి పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపుగా అందరూ బయటే ఉన్నారు. అందరూ బెయిలు మీదనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరు బయట ఉన్నంత కాలం.. తన తండ్రిని చంపిన వారి కేసు తెమలదని, వీరి బెయిళ్లను రద్దు చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. ఈ పిటిషన్ విచారణ సా..గుతున్న తీరు ప్రజలను మాత్రం గందరగోళానికి గురిచేస్తోంది. అక్కడైనా ఆమెకు న్యాయం జరుగుతుందా? అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఈ పిటిషన్ పై సుప్రీంలో తాజాగా వాదనలు జరిగాయి. తదుపరి విచారణ జులై 21 నాటికి వాయిదా పడింది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర రెడ్డి, గజ్జల ఉదయకుమార్ రెడ్డి ల బెయిళ్లు రద్దు చేయాలనేది సునీత వేసిన పిటిషన్. ఈ నిందితులు అందరూ బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్న సంగతిని రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు నివేదించారు. ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న అప్రూవర్ గా మారిన నిందితుడిని ప్రలోభపెట్టడం, బెదిరించడం గురించి కూడా ఆయన కోర్టుకు చెప్పారు. ఇలాంటి బెదిరింపులు అనేకం నడుస్తున్నందువల్లే సునీత, వాటి రద్దు కోసం కోరుతున్నట్లుగా చెప్పారు.
అయితే వైఎస్ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం కౌంటరు సమర్పించడానికి వాయిదా కోరడంతో.. న్యాయస్థానం జులై 21కి వేసింది. ఈలోగా ఇరుపక్షాలు కూడా తమ వాదనలు సమర్పించాలంటూ ఆదేశించింది.
ఏ కోర్టులో బెయిల్ రద్దు కేసు విచారణకు వచ్చినా సరే.. పదేపదే ఇలా వాయిదాలు కోరడం ద్వారానే.. వివేకా హత్యకేసు నిందితులు రోజులు నెట్టేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సాక్షులు మరణించిన నేపథ్యంలో మిగిలిఉన్న సాక్షులకు కూడా ప్రాణహాని ఉన్నదనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. బెయిలు మీద బయటఉన్న ఒక నిందితుడు సునీల్ యాదవ్ కూడా తన ప్రాణానికి ప్రమాదం ఉన్నదని అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల నుంచి అవినాష్ అనుచరుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు. మరి అసలు బెయిలు రద్దు పిటిషన్లపై ఎప్పటికి తీర్పు వస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
