అరె.. జగన్మోహన్ రెడ్డి తన నుదుటికి అయిన గాయం మీద బ్యాండేజీ తీసేశారు. నిన్నటిదాకా నుదుటిమీద అయిన చిన్న గాయానికి పెద్ద బ్యాండేజీతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బ్యాండేజీ లేకుండానే కనిపించారు. తమాషా ఏంటంటే.. నుదుటిమీద గులకరాయి తగిలిన గాయం ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. సాధారణంగా ఎక్కడైనా బ్యాండేజీ తీసేసే సమయానికి గాయం కొంత ఆనవాళ్లు ఉంటుంది.. ఆ తర్వాత నెమ్మదిగా ఆరిపోయి, చర్మం యథాపూర్వ స్థితి వచ్చేస్తుంది. మేనిఫెస్టో కార్యక్రమంలో బ్యాండేజీలేని జగన్ ని గమనించినప్పుడు గాయం ఆనవాళ్లు లేకపోవడాన్ని చూస్తే.. నిన్నటిదాకా కేవలం మేమంతా సిద్ధం సభల్లో ప్రజల సింపతీ కోసమే అంతంత పెద్ద బ్యాండేజీని వేసుకుని తిరిగినట్టుగా అర్థమైపోతోంది.
జగన్ కు గులకరాయి తగిలి సెంటిమీటరు పొడవున చిన్న గాయమైంది. ఆరోజు బస్సులో చేయించుకున్న ప్రాథమిక చికిత్స సరిపోయేదే. కానీ జగన్ విజయవాడలోని జీజీహెచ్ కు వెళ్లి రెండు కుట్లు కూడా వేయించుకున్నారు. ఆ చికిత్స తర్వాత చాలా చిన్న బ్యాండేజీతో ఆస్పత్రినుంచి బయటకు వచ్చిన జగన్.. మరురోజునుంచి నిన్నటిదాకా తలకు రోజురోజుకూ పెద్దదవుతున్న బ్యాండేజీకట్టుతోనే సభల్లో పాల్గొన్నారు. ప్రతి సభలోనూ.. ఎడమచేతి చూపుడువేలితో తన గాయాన్ని ప్రజలందరికీ చూపిస్తూ.. నన్ను చంపడానికి ప్రయత్నించారు.. అయినా నేను వెనకాడేది లేదు.. అంటూ రాయి గాయానికి ముడిపెట్టి కామెడీ డైలాగులు కూడా చెబుతూ వచ్చారు.
జగన్మోహన్ రెడ్డికి అయిన గాయం, దానికి కట్టిన బ్యాండేజీ అనేది పొలిటికల్ ట్రోలర్స్ కు పెద్ద పాయింట్ అయిపోయింది. ఆయన బ్యాండేజీ మీద రోజురోజుకూ ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఆయన సానుభూతి ఆశించారు గానీ.. అంత చిన్న గాయానికి అన్ని రోజులు బ్యాండేజీతో కనిపించేసరికి జనం నవ్వుకోవడం మొదలైంది.
ఈలోగా స్వయంగా డాక్టరు అయిన ఆయన చెల్లెలు సునీత, అన్నయ్య జగన్ కు అడగకుండానే ఒక ఉచిత సలహా ఇచ్చేశారు. గాయానికి ఇంతకాలం బ్యాండేజీ వేసుకునే తిరిగితే చీముపట్టి సెప్టిక్ అవుతుందని ఆమె హెచ్చరించారు. జనం నవ్వుతున్నారని తెలుసుకుని సిగ్గుపడ్డారో లేదా, చెల్లెలు సునీత చెప్పిన సెప్టిక్ అవుతుందనే సలహాకు భయపడ్డారో తెలియదు గానీ.. జగన్ మాత్రం నుదుట బ్యాండేజీని తీసేసి కార్యక్రమానికి హాజరయ్యారు. బ్యాండేజీ తీసేశాక గాయమైన చోట అసలు చిన్న మార్క్ కూడా లేకపోవడం ఒక కొసమెరుపు.