ఆంద్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగానే ఏర్పడిన కూటమి కాబట్టి.. మిత్రపక్షాలకు సీట్లు పంచాల్సి రావడం వలన.. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య చిన్న చిన్న అసంతృప్తులు ఉండడం చాలా సహజం. పలు నియోజకవర్గాల్లో కూటమి పార్టీల కార్యకర్తల మధ్య విభేదాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే బాధ్యత గల ఎమ్మెల్యేలు, అంతకు మించిన స్థాయి గల నాయకులు ఎక్కడా నోరు జారడం లేదు. రెచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే.. కాస్త అదుపుగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి వంటి అగ్రశ్రేణి నాయకులు.. కూటమి బంధం మరికొన్ని దశాబ్దాల పాటు దృఢంగా ఉంటుందని పదేపదేసంకేతాలు ఇస్తూ తమ పాత్ర చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ కమలదళం ఎమ్మెల్యే మాత్రం.. రెచ్చిపోయి మాట్లాడుతూ.. కూటమికి ఐక్యతకు గండికొట్టే డైలాగులో ఓవరాక్షన్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.
తన నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల తీరుమీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీనే కీలక పాత్ర పోషించిందని ఆయన చెబుతున్న డైలాగులు మరీ ఓవర్ గా అనిపిస్తున్నాయి. బిజెపి నాయకులను చిన్న చూపు చూస్తున్నారని ఆయన అంటున్నారు.
‘మా వల్లనే మీరు అధికారంలోకి వచ్చారు’ అనే తరహా స్వాతిశయంతో కూడిన డైలాగులను పార్టీలోని కిందిస్థాయి నాయకులు టీ దుకాణాల వద్ద కూర్చుని చిట్ చాట్ గా మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ.. స్వయంగా తాను ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పార్థసారధి, క్షేత్రస్థాయి వాస్తవాలను బలాబలాలను విస్మరించి.. ఇలా మాట్లాడడం కరెక్టు కాదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
నిజం చెప్పాలంటే.. భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా సొంతంగా గెలుచుకునే బలం లేదనేది అందరికీ తెలిసిన సంగతి. కానీ ప్రతి చోటా ఒకటిరెండు శాతం ఓట్లను చీల్చగల పలచటి బలం ఉన్నదని కూడా అందరూ ఒప్పుకుంటారు. అలాంటి నేపథ్యంలో.. జగన్ కు వ్యతిరేకంగా ఉండే ఒక్క ఓటు కూడా చీలడానికి వీల్లేదని గట్టి నిర్ణయంతో ఉన్న పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలతో పలుమార్లు మంతనాలు జరిపి.. మొత్తానికి కూటమి బంధం కుదరడానికి కృషిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత గల ఏ నాయకుడు అయినా సరే చెప్పవలసింది ఒకటే మాట.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో మూడు పార్టీల పాత్ర సమానం అని మాత్రమే చెప్పాలి. అంతే తప్ప.. కార్యకర్తల మధ్య వైషమ్యాలు పెరిగేలా.. ఎమ్మెల్యే స్థాయిలోని పార్థసారది మాట్లాడడం కరెక్టు కాదని పలువురు భావిస్తున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, తాడిపత్రి నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెడుతూ.. అక్కడ బిజెపి నాయకులకు గౌరవం దక్కడం లేదని ఇలామాట్లాడడం చిత్రంగా ఉంది. నిజానికి ఆయన నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడును పట్టించుకోకుండా రాజకీయం చేస్తుండడం విమర్శలపాలవుతున్న సంగతి ఆయన గుర్తించినట్టు లేదు.
కాషాయ ఎమ్మెల్యేకు ఓవరాక్షన్ ఎందుకు?
Thursday, April 17, 2025
