తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాపం ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఢిల్లీలో ధర్నా చేయాలని ఒక అతిపెద్ద ఉద్యమానికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో కూడా అస్తిత్వంలోనే ఉంది. అయితే కొన్ని చోట్ల మాత్రమే చెదురుమదురు సంఘటనలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఎందుకు కేవలం తంబళ్లపల్లెలో, పుంగనూరులో మాత్రమే ప్రతిఘటనలు వారికి ఎదురయ్యాయి ఎందుకు? పలనాడు ప్రాంతంలో మాత్రమే గొడవలు రేగుతున్నాయి ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే అర్థం చేసుకోగలిగితే జగన్ మళ్ళీ నోరెత్తి మాట్లాడరు!
పుంగనూరు, తంబళ్లపల్లె ఘటనలను ఉదాహరణగా తీసుకుందాం. ఎందుకంటే మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయగానే జగన్మోహన్ రెడ్డికి పాపం కళ్లమట నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ ఉదాహరణలను పరిశీలిద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గమనించినట్లయితే కేవలం పుంగనూరు, తంబళ్లపల్లెలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇక్కడ దక్కిన మెజారిటీ పుణ్యమే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి కూడా విజయం సాధించారు. వారు గెలిచినంత మాత్రాన ప్రజాదరణ కారణం అనుకోవడానికి వీల్లేదు. మొదటి నుంచి కూడా కేవలం దొంగ ఓట్లు అనేదే తన పద్ధతిగా రాజకీయం చేస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో ఎంపీ ఉపఎన్నిక జరిగినా కూడా.. దొంగఓటర్లను లారీల్లో సప్లయి చేసే చరిత్ర ఆయనది. తన కుటుంబ సభ్యులను మాత్రం అదే విధానంలో గెలిపించుకున్నారు.
ప్రజల కడుపు మంట కూడా అదే! తంబళ్లపల్లెలో వారు చెప్పినది కూడా అదే దొంగ ఓట్లతో గెలిచిన నువ్వు ఎమ్మెల్యేగా ఉండరాదని మాత్రమే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని నిలదీశారు. మిథున్ రెడ్డి పుంగనూరు వచ్చినప్పుడు కూడా ప్రజా ప్రతిఘటన అందుకే వచ్చింది.
మరో కారణం ఏంటంటే పుంగనూరులో ఇన్నాళ్లపాటు తెలుగుదేశం, జనసేన, పెద్దిరెడ్డి వ్యతిరేక ముద్ర ఉన్న ఏ వ్యక్తినైనా స్వేచ్ఛగా బతకనివ్వకుండా ఎంతగా అణచివేశారో తెలుసుకోవడానికి నిదర్శనం ఇవాళ జరిగిన ఘర్షణలు, అల్లర్లు. ఐదేళ్లపాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇనుప పాదాల కింద నలిగిపోయిన ప్రజలలో వెల్లువెత్తిన ఆవేశమే ఆ ఘర్షణలు. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కార్యకర్తలను పురమాయించి ఎగదోసినట్లుగా జగన్మోహన్ రెడ్డి లేకి వ్యాఖ్యలు చేయడం అర్థం లేని విషయం.
అల్లర్లు అనేవి ఒకరు చేస్తే జరిగేవి కాదు. ఇరువర్గాలు రెచ్చిపోవడం వల్ల మాత్రమే జరిగేవి. పుంగనూరుకు మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చి నిరసన తెలియజేసి ఉండవచ్చు గాక. కానీ అదే సమయంలో అక్కడికి వైసిపి వారు వచ్చి రాళ్లురవ్వకుండా ఉండి ఉంటే- తంబళ్లపల్లెలో లాగా కేవలం నిరసనల వరకే ఆ ఘటన పరిమితమై ఉండేది. కానీ వాళ్లు రాళ్లు నువ్వే సరికి అది కాస్త ముదిరి తీవ్ర రూపం దాల్చింది. వాళ్ళ వాహనాలను ధ్వంసం చేసే వరకు రెచ్చగొట్టింది. ఇలాంటి విషయంలో ఉండే ప్రాక్టికల్ అంశాలను జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. సంయమనం అనేది అధికారంలో ఉన్న వారికి మాత్రమే కాదు- తమ పార్టీ వారికి కూడా అవసరం అనే సంగతి ఆయన గ్రహించాలి. ఆ మేరకు పార్టీ శ్రేణులకు హితబోధ చేయాలి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు చేయడానికి కార్యకర్తలకు ప్రేరణ ఇవ్వాలి తప్ప- అల్లర్లు ఘర్షణలకు వారిని రెచ్చగొడుతూ ఉంటే ముందు ముందు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయని జగన్ తెలుసుకోవాలి.
పుంగనూరులో మాత్రమే గొడవ జరిగింది ఎందుకు?
Saturday, January 18, 2025