రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్ ఉన్నందున.. ఈ కేసు విచారణ పర్వం గురించి తాను ఇప్పుడేమీ చెప్పలేను’ అని చాలా సింపుల్ గా ముక్తాయించారు. వ్యవహారం కోర్టులో ఉన్నందున ఏమీ చెప్పలేను అంటూనే ఆయన కూటమి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రత్యేకంగా తమ కుటుంబాన్ని వేధించడంలో భాగంగా అనేక కేసులు పెడుతున్నారని, ఆరోపణలు చేస్తున్నారని మిథున్ రెడ్డి ప్రభుత్వం మీదనే నిందలు వేశారు. ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేరని లిక్కర్ స్కాంతో కూడా తనకు సంబంధం లేదని కొట్టిపారేశారు. అయితే ఆయన దూకుడును వ్యవహార సరళిని గమనించిన ప్రజలు మాత్రం.. తొందరెందుకు మిథున్ రెడ్డీ.. మీ మీద చేస్తున్న ప్రతి ఆరోపణలను నిరూపించే సమయం ముందుంది.. ఒక్కటొక్కటిగా అన్ని కేసులు తేలుతాయి అని హెచ్చరిస్తున్నారు.
మిథున్ రెడ్డి మీడియా ఎదుట మాట్లాడుతూ.. తమ కుటుంబం మీద మదనపల్లె ఫైల్స్ దహనం కేసు అన్నారని, ఆ తర్వాత అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు చేశారని, అటవీ సంపదను అటవీ భూములను దోచుకున్నట్లుగా కేసులు పెట్టారని, ఎర్రచందనం అక్రమ రవాణా గురించి తమ మీద ఆరోపణలు చేశారని అలాగే ఇప్పుడు లిక్కర్ స్కాం గురించి కూడా ఆరోపణలు చేస్తున్నారని.. వీటన్నింటిలోనూ ఏ ఒక్క దానిని కూడా నిరూపించలేరని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మిథున్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. తనమీద ప్రభుత్వం ఇంకా నమోదు చేయడానికి హ్యూమన్ ట్రాఫికింగ్ డ్రగ్స్ కేసు తప్ప ఇంకేమీ లేవని ఎద్దేవా చేశారు.
అయితే చాలా ధీమాగా తనకు ఎలాంటి అవినీతితోను సంబంధం లేదని అన్నంత మాత్రాన చట్టం కేసులను పక్కన పడేసి కూర్చోదు అనే సంగతి ఆయన తెలుసుకోవాలి. మదనపల్లి ఫైల్స్ దగ్గర నుంచి, అటవీ భూములను కబ్జా చేసి అనుభవించడం వరకు, సరికొత్త ఇసుక పాలసీ పేరుతో అక్రమ మైనింగ్లను ప్రోత్సహించి వేల కోట్ల రూపాయలు దండుకున్న బాగోతాలతో సహా సంస్థ అవినీతి కుంభకోణాలలో ప్రతిదీ నిరూపణ అవుతుందని వరుస క్రమంలో ప్రతిదాన్ని గురించి మిథున్ రెడ్డి గాని, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని విచారణకు రావాల్సి ఉంటుందని.. తేలే వివరాలను బట్టి జైలు శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని కూడా ప్రజలు విశ్లేషిస్తున్నారు.
ఇల్లలకగానే పండగ కాదన్న సామెత చందంగా.. ఒకసారి విచారణకు హాజరై బయటకు వచ్చినంత మాత్రాన మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా తేలారని అనుకోవడానికి వీల్లేదు. శనివారం నాడు సిట్ బృందం అడిగిన అనేక ప్రశ్నలకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పిన నేపథ్యంలో ఆయన విచారణకు మరొకసారి రావాల్సి ఉంటుందని అధికారులు ఆయనకు చెప్పారు. ఇవాళ నమోదు చేసిన వివరాలన్నింటినీ రికార్డు చేసి వాటి మీద ఆయన సంతకాలు కూడా తీసుకున్నారు.
ముడుపులు సమర్పించిన కొందరు వ్యాపారులను కూడా విచారించిన తర్వాత వారందరి వాంగ్మూలాలలో వెల్లడయ్యే వివరాలన్నింటినీ సమన్వయ పరచుకుని తర్వాత మళ్లీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారణకు పిలుస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
తొందరెందుకు మిథున్ అన్ని వరుసలో వస్తాయి!
Monday, December 8, 2025
