హూ ఈజ్ నెక్ట్స్ : బిగ్ బాస్ కోటరీలో ఆందోళన!

Friday, December 5, 2025

మద్యం కుంభకోణంలో నాలుగో నిందితుడు అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. దాదాపుగా ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేయబోతున్న తరుణంలో, తప్పించుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలు అన్నీ విపలమైన తర్వాత, విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టుకు వారెంటు తీసుకుని ఉన్న నేపథ్యంలో.. విచారణ ముగిసిన తర్వాత.. మిథున్ రెడ్డికి నోటీసులు అందించి, అరెస్టు చేసే అవకాశం ఉన్నదని నిన్నటినుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే.. అంతకు మించిన కీలక చర్చ మరొకటి ఉంది. సాయంత్రానికి అరెస్టు కూడా పూర్తయితే మద్యం స్కామ్ లో  కటకటాల వెనక్కు వెళ్లిన రెండో రాజకీయ నాయకుడు మిథున్ రెడ్డి అవుతారు. అయితే ఇప్పుడు అసలు పాయింట్ అదికాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుట్టుచప్పుడు కాకుండా హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ ‘హూ ఈజ్ నెక్ట్స్’ అనేదే! మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చి.. ఆయనను అరెస్టు చేసి రిమాండుకు పంపే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

మద్యం స్కామ్ బాగోతాన్ని కేసుగా నమోదు చేసిన తర్వాత.. తొలిదశలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్ లను విచారించినప్పుడే వారికి చాలా వివరాలు లభించాయి. ఆ తరువాత సుదీర్ఘకాలం పరారీలో ఉండిపోయిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చివరకు దొంగ పాస్ పోర్టుతో విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు దొరికిపోయారు. ఆ తర్వాత విచారణ వేగం పుంజుకుంది. అనేకమంది కొత్త కొత్త నిందితులు జతచేరుతూ వచ్చారు.
రాజ్ కెసిరెడ్డిని విచారించిన తొలిసందర్భంలోనే ఈ స్కామ్ మొత్తం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే రూపుదిద్దుకున్నట్టుగా వెల్లడైందని వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి.. 2024 ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి భారీగా నిధులు సమకూరేలాగా.. వేలకోట్ల రూపాయలు వచ్చేలాగా.. కొత్త పాలసీ రూపకల్పన చేయాలని ముందే తమకు దిశానిర్దేశం చేసినట్టుగా అప్పట్లోనే రాజ్ కెసిరెడ్డి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే అని అందరికీ అర్థమైంది. అయినా సరే.. పోలీసులు మాత్రం.. విచారణలో వెల్లడవుతూ వచ్చిన ఒక్కొక్క పేరునూ నిందితుల జాబితాలో చేరుస్తూ అవసరాన్ని బట్టి వారిని విచారణకు పిలుస్తూ, అరెస్టు చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేశారు. ఎన్ని పరిణామాలు జరుగుతున్నా వైఎస్ జగన్ పేరు మాత్రం నిందితుల జాబితాలోకి రాలేదు. అనవసరమైన రాద్ధాంతం రేగకకుండా, దరిమిలా కేసు విచారణ పక్కదారి పట్టకుండా.. తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగానే జగన్ పేరును ముందే నిందితుల జాబితాలో చేర్చలేదని పలువురు అంచనా వేస్తున్నారు.

రాజకీయ నాయకుల్లో తొలుత చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పుడు రెండో నేత అరెస్టుగా మిథున్ రెడ్డిని రిమాండుకు పంపబోతున్నారు. ఈ స్కామ్ లో పలువురు నాయకుల పాత్ర స్పష్టంగా తేలిపోగా.. నెక్ట్స్ అరెస్టు అయ్యేది ఎవరు? అనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. తర్వాతి అరెస్టు జగన్మోహన్ రెడ్డిదే కావొచ్చునని కూడా పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. మరి సిట్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయో వేచిచూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles