ఆయన అనుకోకుండా ఎంపీ అయ్యారు. కేవలం నోటి దూకుడు, కొందరి ప్రాపకం కోసం ఎంతటి వారినైనా సరే అడ్డగోలుగా బూతులు తిట్టడానికి వెనుకాడే అలవాటు లేకపోవడం ఆయనను అందలాలు ఎక్కించింది. సాధారణ పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టరు స్థాయినుంచి హఠాత్తుగా లోక్ సభ ఎంపీ అయిపోయారు. కానీ మనిషిలోని కురచబుద్ధులు మాత్రం మాసిపోలేదు. ఎంపీగా ఉంటూ.. ఓ మహిళతో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడి.. అసహ్యకరమైన రీతిలో పార్టీ పరువు తీశారు. ఆయన మళ్లీ గెలిచే అవకాశం లేదని గుర్తించిన జగన్.. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఒక్కసారిగా ఎదుగుదల- పతనం అన్నీ పూర్తయిన తర్వాత.. గోరంట్ల మాధవ్ ఎన్నికల నాటినుంచి పాపం.. సైలెంట్ గానే ఉంటున్నారు. అలాంటి మాధవ్ ఇప్పుడు తాను చేసిన అతివేషాల ఫలితంగా.. పోలీసు కస్టడీలో వారికి జవాబులు చెప్పాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది.
ఏడాదిన్నరకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లూప్ లైన్లో ఉన్న నాయకుడు గోరంట్ల మాధవ్.. ఇటీవల హఠాత్తుగా మళ్లీ తెరమీదకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లికి వెళ్లి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తరువాత.. పోలీసులు బట్టలు ఊడదీయించి కొడతానని అన్న తరువాత.. దానికి జవాబుగా ఎస్ఐ సుధాకర్ యాదవ్, తాను జగన్ కు హెచ్చరికలు చేసిన తరువాత.. గోరంట్లకు అవకాశం వచ్చింది. జగన్ కు అనుకూలంగా పోలీసుల మీద ధ్వజమెత్తడానికి మాజీ పోలీసు అధికారిగా ఆయనకు పురమాయింపు వచ్చింది. ఆయన ఏకంగా తాడేపల్లికి వెళ్లి అక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తారు.
ఈలోగా జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి గోరంట్లకు మరో అవకాశం కలిసి వచ్చింది. వైఎస్ భారతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతో గోరంట్ల తన సహజశైలిలో రెచ్చిపోయారు. పోలీసు వాహనాన్ని వెంబడించి, అడ్డుకుని ఆ నిందితుడి మీద ఎస్పీ కార్యాలయ ఆవరణలోనే దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడిచేశారు. ఫలితంగా ఇప్పుడు జైల్లో రిమాండులో ఉన్నారు.
కాగా ఆయనను రెండు రోజుల కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఒక మాజీ పోలీసు అధికారిగా చట్టం, నిబంధనలు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ.. ఎవ్వరి పురమాయింపు మేరకు పోలీసులమీద, నిందితుడి మీద బహిరంగంగా దాడికి దిగారో పోలీసులు విచారణలో తెలుసుకోనున్నారు. జగనన్న కళ్లలో ఆనందం పుట్టించడానికి.. ఇలాంటి దాడులుచేయాలని పురమాయించింది ఎవ్వరు? అసలు ఐటీడీపీ కార్యకర్తను అరెస్టు చేసి తరలిస్తున్న సంగతిని మీకు సమాచారం అందజేసినది ఎవ్వరు? అనే వివరాలను పోలీసులు తెలుసుకోనున్నారు. గోరంట్ల పోలీసు కస్టడీలో కూడా అతిచేస్తే.. ముందు ముందు ఆయన మీద మరింత కఠిన చర్యలుంటాయని పలువురు భావిస్తున్నారు.
‘జగనన్న కళ్లలో ఆనందం’ ఆర్డర్ చేసింది ఎవరు?
Thursday, December 11, 2025
