సజ్జల ఎవరు.. జగన్ చెప్తే తప్ప నమ్మలేం’

Thursday, December 4, 2025

2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని గురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలు గుర్తుందా? చంద్రబాబునాయుడుకు ఇక్కడ ఇల్లు కూడా లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మద్దతుగానే ఉన్నారు. అందువల్లనే ఆయన ఇక్కడ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అని వాళ్లంతా పదేపదే చెప్పారు. అమరావతి రాజధానికి వైఎస్ జగన్ కూడా జైకొట్టినట్టే అని రాష్ట్ర ప్రజలందరినీ ఒక భ్రమలోకి నెట్టారు. జగన్ ఎటూ ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్నాడు.. చంద్రబాబు ఆల్రెడీ చాలా వరకు పనులు ప్రారంభించేసిన అమరావతి విషయంలో ఇక జగన్ చేయగలిగేది ఏమీ ఉండదు లెమ్మని.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తన విశ్వరూపం ఏమిటో, విధ్వంసక రూపం ఏమిటో, అమరావతిని శ్మశానంలాగా తాను ఎలా మార్చగలనో నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే డ్రామా ప్లే చేస్తున్నది. ప్రజలను మోసగించడానికి ఒకసారి వాడిన డ్రామా మళ్లీ పనిచేయదని.. కావలిస్తే కొత్త డ్రామా వాడాలనే స్పృహకూడా వారికి లేదు. ఈసారి తాము అధికారంలోకి వస్తే.. అమరావతినుంచే పాలన సాగిస్తాం అని.. ఎక్కడకూ వెళ్లబోయేది ఉండదని సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. అయినా.. వైసీపీ ప్రభుత్వం వచ్చినంత మాత్రాన.. అమరావతిలోనే ఉంటారో లేదో ప్రకటించడానికి సజ్జల ఎవరు? అనేది ప్రజల ప్రశ్న! జగన్ తర్వాత అంతటి ప్రధాన నాయకులుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్లే పార్టీనుంచి బయటకు వెళ్లారు. వ్యక్తిస్వామ్య పెత్తందారి పార్టీ అది. అదే తరహాలో.. సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఏదో ఒక నాటికి పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చు. లేదా, ఒకవేళ మళ్లీ గెలిస్తే.. సజ్జల మాటలను బుట్టదాఖలు చేసి.. జగన్ మళ్లీ విశాఖపోతా.. అని పాత పాట పాడవచ్చు. అలా జరిగితే.. సజ్జల రాష్ట్రప్రజలకు పూచీ ఉంటారా? అనేది ప్రజల సందేహం.

గతంలో కూడా అనేకమంది మంత్రులు అమరావతి నుంచే జగన్ పాలిస్తారని చెప్పినప్పటికీ.. గెలిచిన తర్వాత మూడురాజధానుల మోసాన్ని తెరపైకి తెచ్చిన వైనం గుర్తుచేస్తున్నారు. అందుకే.. రాజధాని ఎక్కడ ఉంటుంది.. తాము ఎలా పరిపాలిస్తాం అని చెప్పగల అధికారం, హక్కు సజ్జలకు లేవని, అయితే గియితే జగన్మోహన్ రెడ్డి తన నోటివెంట.. డొంకతిరుగుడులు లేకుండా, స్పష్టంగా చెబితే తప్ప.. నమ్మలేం అని ప్రజలు అనుకుంటున్నారు. సజ్జల తన మాటల గారడీతో మీడియా వారిని, ప్రజలను మోసం చేయాలనుకుంటే సాధ్యం కాదని కూడా అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles