రాంగోపాల్ వర్మ నిన్నటిదాకా చాలా బీరాలు పలికారు. ఎక్కడ పోలీసులు అరెస్టు చేస్తారో అనే భయంతోనే అజ్ఞాతంలో గడుపుతూ.. ‘డెన్’లోనే ఉన్నానని బుకాయిస్తూ గడిపిన వర్మ.. సెలెక్టెడ్ టీవీ చానెళ్లను మాత్రం తానున్న చోటకు పిలిపించుకుని ఇంటర్వ్యూలు ఇచ్చిన వర్మ.. ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్నిరోజులుగా తను చెబుతున్న విషయాలనే, అరిగిపోయిన గ్రాంఫోను రికార్డులా మళ్లీ వినిపించారు. ఈనెల 9వ తేదీ వరకు రాంగోపాల్ వర్మను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, ముందస్తు బెయిలు కోసం ఆయన వేసుకున్న పిటిషన్ ను ఆరోజున విచారిస్తామని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో అలా కోర్టు తీర్పు రాగానే.. ఇలా ఆర్జీవీ మీడియా ముందు ప్రత్యక్షం అయ్యారు. ఈసారి ఏకంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో పెట్టిన తప్పుడు పోస్టులకు సంబంధించి రాంగోపాల్ వర్మ మీద రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసి ఉన్నారు. విచారణకు రెండుసార్లు నోటీసులు అందుకున్న వర్మ.. తనకోసం వచ్చిన ప్రకాశం జిల్లా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు.
అయితే తాను పరారీ కాలేదని, డెన్ లోనే ఉన్నానని కొన్ని టీవీ చానెళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. పోలీసులు తనను అరెస్టు చేయడానికి రానేలేదని కూడా పేర్కొన్నారు. కానీ ఆయన మాత్రం ఇవాళ్టిదాకా అరెస్టుభయంతో వణికిపోయారనే మాట నిజం. తాను వణికిపోతున్నానంటూ థంబ్ నెయిల్స్ పెడుతున్నారని వర్మ ఎద్దేవా చేశారు. తాను ఇవాళ్టిదాకా వణికిపోయారనడానికి నిదర్శనంగా, 9వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ ఇవాళ అలా హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే, సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ పెట్టారు.
ఆయన చెప్పిన కొత్తసంగతులు మాత్రం ఏమీ లేవు. ఇంటర్వ్యూల్లో చెప్పినవే. తనకు భయం లేదని, అరెస్టు చేసినా భయపడనని, జైల్లో ఖైదీలతో మాట్లాడి కొత్త కథలు తయారుచేసుకుంటానని ఇదే మాటలు చెప్పుకొచ్చారు. ఏడాది కిందట పోస్టులకు ఇప్పుడు కేసులేంటి అంటూ.. కోర్టులో వినిపించాల్సిన వాదనల్ని ప్రెస్ మీట్ లో చెప్పుకున్నారు. ‘భయపడను’ అని పదేపదే చెప్పుకోవడంలోనే ఆయన భయం కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.