కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటినుంచి ఒక్కటొక్కటిగా అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. పుట్ట పగిలితే పాపాలు బయటపడినట్టుగా బియ్యం స్మగ్లింగుతో ముడిపడి ఉన్న అనేక అక్రమాలు ఇప్పుడు తెలిసివస్తున్నాయి. కాకినాడ పోర్టునుంచి షిప్ లో పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ పట్టుబడడం, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా అక్కడకు వెళ్లి.. వ్యవహారం మొత్తాన్ని పరిశీలించి.. తెరవెనుక ఉన్న పెద్దలందరినీ బయటకు తెస్తానని ప్రతిజ్ఞచేయడం అందరికీ తెలుసు. ఆ తర్వాత విశాఖపట్నం పోర్టునుంచి జరుగుతున్న అక్రమ బియ్యం స్మగ్టింగ్ దందా కూడా వెలుగులోకి వచ్చింది. క్రిష్ణపట్నం, చెన్నై పోర్టులనుంచి కూడా బియ్యం స్మగుల్ చేస్తున్నారనే సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. సందట్లో సడేమియా అన్నట్టుగా మాజీ మంత్రి పేర్ని నాని పేరు తెరపైకి వచ్చింది. కాదు కాదు, ఆయనే తనను తాను ఈ వివాదం తెరమీదికి ఆవిష్కరించుకున్నారు.
జగన్ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. మంత్రిగా వెలగబెట్టిన పేర్ని నాని మచిలీపట్నంలో ఉన్న తన గోదాముల్ని ప్రభుత్వానికి లీజుకు ఇచ్చారు. పీడీఎస్ బియ్యం అక్కడ నిల్వచేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఒక్కో బస్తాకు నెలకు రూ.5 రూపాయల వంతున చెల్లించేలా గోదాములు ఇచ్చారు. ఈ వ్యవహారంలోనే ఆయనకు నెలవారీగా కొన్ని లక్షలరూపాయల లాభం చేకూరేలా డీల్స్ సెట్ అయ్యాయి. అయితే.. అసలు అరాచకం ఇది కాదు. అదేమిటో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
పీడీఎస్ బియ్యం స్మగ్లింగు వ్యవహారాలు రాద్దాంతం అవుతున్న సమయంలో.. పేర్ని నాని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తన గోడౌన్లలో ఉన్న పీడీఎస్ బియ్యంలో 3200 టన్నులు మాయమైనట్లుగా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. వాటి విలువ ఎంతో చెబితే తాను చెల్లించేస్తానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ ఈ లీజు ఒప్పందం ప్రకారం గోదాముల నిర్వహణ మొత్తం వాటి యజమానిదే అయిన నేపథ్యంలో, ఇలాంటి నిల్వల తేడాలు చోటు చేసుకున్నప్పుడు రెట్టింపు సొమ్మును జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. పేర్ని నాని లేఖ రాసిన తర్వాత.. అధికారులు వెళ్లి తనిఖీలు చేగా.. 3200 కాదు కదా.. 3700 టన్నులు మాయమైఉన్నట్టు గుర్తించారు. దీని విలువ దాదాపు 90 కోట్లు ఉంటుందని అంటున్నారు. అంటే జరిమానాలు వేస్తే దాదాపు 180 కోట్లు పేర్ని నాని కట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు సివిల్ క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాలి. ఆయన గోదాముల్ని బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశం కూడా ఉంది.
అసలు అరాచకం ఆ తర్వాతే వెలుగుచూసింది. పేర్ని నాని తన గోదాముల్లో మాయమైనట్టుగా చెబుతున్న పీడీఎస్ బియ్యం అక్కడినుంచి నేరుగా కాకినాడ పోర్టుకు తరలిపోయి, అక్కడి వైసీపీ నేతల స్మగ్లింగ్ దందా ద్వారా విదేశాలకు తరలిపోయినట్టు తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం నిల్వలకు వైసీపీ నేతలే తమ గోదాముల్ని అద్దెకిచ్చి, గుట్టుచప్పుడు కాకుండా ఆ గోదాముల్నించి బియ్యాన్ని పోర్టుకు తరలించేసి కాజేస్తున్నారని అర్థమవుతోంది. కాకినాడ స్మగ్లింగు బయటపడ్డాక పేర్ని నాని లేఖ రాశారని, లేకపోతే.. గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిపోయిఉండేదని అంతా అనుకుంటున్నారు.
వారెవ్వా!: పేర్ని నాని గోడౌన్ -టూ- కాకినాడ పోర్ట్!
Thursday, January 16, 2025