జూన్ 4 అంటే.. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే రోజు. ఎందుకంటే.. ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి.. అయిదేళ్లపాటు దురహంకార, దుర్మార్గపు, విధ్వంసక పాలనను రాష్ట్రప్రజలకు రుచిచూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపానలకు ప్రజలు చరమగీతం పాడిన రోజు. అందుకే ఈ రోజును అసురవధ జరిగిన రోజుగా పరిగణించి.. దీపావళిలాగా వేడుకగా జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది జనసేన పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు జూన్ 4న దీపావళి చేసుకున్నారు. కూటమి సారథ్యంలో అభివృద్ధి పాలనకు బాటలు వేసినందుకు సంక్రాంతి పండుగా చేసుకున్నారు. రాష్ట్రమంతా రంగవల్లులు తీర్చిదిద్దారు.
ఒక్క చాన్స్ అంటూ గద్దె ఎక్కి.. ఇంకా ముప్పయ్యేళ్లు పరిపాలించబోయేది నేనే అన్నట్టుగా దురహంకారంతో చెలరేగిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ప్రజలు దారుణంగా తిరస్కరించిన రోజు నుంచి అచేతనంగా ఉండిపోయిన సంగతి ప్రజలకు తెలిసిందే. జైళ్లలో ఉన్న పార్టీ నేరస్తులను ములాఖత్ పేరిట వెళ్లి పరామర్శించడం తప్ప.. వైఎస్ జగన్ ఈ ఏడాది రోజుల్లో చేసిందేమీ లేదు. అయితే టైమింగ్ కూడా తెలియకుండా.. ప్రజలు తనను తిరస్కరించిన రోజును వెన్నుపోటు దినంగా నిర్వహించాలని జగన్ పిలుపు ఇచ్చారు. ఆయన ఇదివరకు పిలుపు ఇచ్చిన కొన్ని నిరసన కార్యక్రమాల తరహాలోనే ఈ వెన్నుపోటు దినం కూడా దారుణంగా తుస్సుమంది.
అయితే దీనికి కౌంటరుగా జనసేన పార్టీ సంక్రాంతి- దీపావళి నిర్వహించాలంటూ తమ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పిలుపు ఇచ్చింది. ప్రతిచోట జనసేన వీరమహిళలు తమ ఇళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద రంగవల్లులను తీర్చిదిద్దారు. పార్టీ నాయకులందరూ పెద్దఎత్తున టపాకాయలు పేల్చి జగన్ పాలనను ప్రజలు అంతం చేయడం అనేది నరకాసుర వధతో సమానం అంటూ పండుగ చేసుకున్నారు.
ఒకేరోజున రెండు పోటాపోటీ కార్యక్రమాలు జరగడంతో.. ఎవరిబలం ఎంత ఉన్నదో తేటతెల్లం అయింది. ఈ సంక్రాంతి-దీపావళి కార్యక్రమాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అసలు రాష్ట్రంలోనే ఉండకుండా కార్యక్రమానికి పిలుపు ఇచ్చేసి, బెంగుళూరు పారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ మాత్రం జూన్ 4 ను పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబునాయుడు తన 4.0 ప్రభుత్వం కొలువుతీరిన జూన్ 12న వేడుకలు నిర్వహించడానికి.. ప్రజలకు ప్రకటించిన వరాలు అమల్లోకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు.
‘అసురవధ జరిగినవేళ..’ జనసేన సరికొత్త దీపావళి!
Monday, December 8, 2025
