తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గోశాలపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఒకవైపు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కులపిచ్చి అనేది నాయకులతో ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేయిస్తుందో తెలుసుకోవడానికి ఇది చక్కటి ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో గోశాల ఇన్చార్జిగా ఉన్న హరినాధరెడ్డి అనే వ్యక్తిని, వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడిగా భావించి టీటీడీ సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో డీఎఫ్ఓ స్థాయి అధికారిని నియమించింది. ఈ కడుపుమంటతో.. హరినాథరెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారంతో.. టీటీడీ మీద బురద చల్లడానికి కరుణాకర రెడ్డి సాహసిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా ఉన్నాయి. ఎక్కడో మరణించి ఉన్న ఆవుల ఫోటోలను తీసుకువచ్చి వాటిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం ద్వారా.. టీటీడీ గోశాలలో ఆవులు మరణించినట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. వైసీపీ నాయకులు ఏ కారుకూతలు కూసినా సరే.. వాటిని పతాక శీర్షికల్లో ప్రచురించడానికి కాచుకుని ఉండే జగన్మోహన్ రెడ్డి కరపత్రిక సాక్షి ఆ తప్పుడు కథనాలను చాలా ప్రముఖంగానే ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.
భూమన ప్రచారం చేస్తున్న తప్పుడు సంగతులను ప్రచురిస్తూ, తప్పుడు కథనాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సాక్షి పత్రిక, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ల మీద ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం అంటూ మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు. నిజానికి నాయకుడు పెట్టిన ప్రెస్ మీట్, చూపించిన ఫోటోలకు ప్రచారం కల్పించినందుకు పత్రిక మీద ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తే ఒనగూరు ప్రయోజనం పెద్దగా ఉండదు.
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరుణాకర రెడ్డి చూపించిన ఫోటోల మూలాలను వెతకాలి. అవి ఎక్కడి నుంచి రాబట్టిన ఫోటోలో ఆధునిక సాంకేతికత ద్వారా గుర్తించాలి. సాధారణంగా ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఫోటోలతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. అవన్నీ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పలువురు ఆకతాయిలు తయారుచేసే పోస్టులుగా సాధారణంగా ఉంటాయి. కానీ.. ఇప్పుడు ఆ దిగజారుడు తనం సీనియర్ రాజకీయ నాయకులకు కూడా పాకిందనడానికి భూమన- గోశాల ఉదాహరణ సరిపోతుంది. ఆయన చూపించిన ఫోటోలు ఫేక్ అని, అవి గోశాలవి కాదని నిరూపించగలిగితే.. ప్రభుత్వం ఏకంగా భూమన మీదనే కేసు పెట్టవచ్చు. బీఎన్ఎస్ చట్టాలప్రకారం.. విద్వేషాలు రెచ్చగొట్టడానికి జరిగే ప్రయత్నంగా చాలా గట్టికేసు నమోదు అవుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
జగన్ కరపత్రికపై కన్నెర్ర చేస్తే ఏమవుతుంది?
Friday, April 18, 2025
