మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి పేరు రాసిపెట్టుకోండి.. ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. పరవాలేదు. నీ టైం బాగుంది కొట్టు అనండి. ఆ తర్వాత మన టైం వస్తుంది.. అప్పుడు మనమూ కొడదాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారెవరినీ వదలిపెట్టం. రిటైరైనా, దేశం వదిలిపోయినా లాక్కొస్తాం. వారికి సినిమా చూపిస్తాం’
ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటినుంచి వచ్చిన మాటలు. విశాఖపట్నం కార్పొరేషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది. ఆ కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు, డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా కూటమి దక్కించుకుంది. జగన్మోహన్ రెడ్డి ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ.. క్యాంపు రాజకీయాలు నడిపినప్పటికీ.. ముగ్గురు మాజీ మంత్రులతో ఒక బృందం ఏర్పాటుచేసి కార్పొరేటర్లను బుజ్జగించే యజ్ఞం సాగించినప్పటికీ.. ఆయనకు ఫలితం దక్కలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని నమ్మిన వాళ్లు, వైఎస్ జగన్ పార్టీని నడుపుతున్న తీరు ఆ పార్టీని సమాధి చేసేస్తుందని భయపడుతున్న వారు.. ఆ పార్టీని వీడి కూటమి పార్టీల్లోకి చేరిపోవడం చాలా సహజంగా జరుగుతోంది. విశాఖ కార్పొరేటర్లు కూడా పలువురు అదేమాదిరిగా పార్టీలు మారారు. తత్ఫలితంగా వైసీపీ కార్పొరేషన్ ను కోల్పోవాల్సి వచ్చింది.
ఈ పరాభవం జగన్ కు అపరిమితమైన ఫ్రస్ట్రేషన్ కలిగించి ఉండవచ్చు. కానీ.. విశాఖలో తన పార్టీలో మిగిలిన కొందరు కార్పొరేటర్లతో పాటు, మరికొందరు స్థానిక నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన సమావేశంలో జగన్ ఇలాటి మాటలు చెప్పడం చిత్రంగా ఉంది. ఆయన మాటలకు ఆ పార్టీ వారే బెదిరిపోతున్నారు.
‘కొడితే కొట్టించుకోండి’ అని నాయకుడు పంపుతున్న సందేశం వారిని భయానికి గురిచేస్తోంది. ‘మన టైం వచ్చినప్పుడు’ అంటూ ఆయన చెబుతున్న టైం వచ్చేదెప్పుడు. ఈయన ఇలాగే పార్టీని నడిపితే.. ఈసారి ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావడం సాధ్యమేనా? ఆయన మాత్రం ప్యాలెస్ లలో కూర్చుని కొట్టింకోండి.. నరికించుకోండి అని మన మానాన మనల్ని వదిలేస్తే మనుగడ ఎలాగ అనే భయం వారిలో ఉంది. మీమీద ఎలాంటి దాడి జరిగినా సరే.. పార్టీ అండగా ఉంటుంది. మీమీద ఈగ వాలనివ్వకుండా పార్టీ చూసుకుంటుంది. మీమీద దాడిజరిగితే మీ బాధ్యత మొత్తం పార్టీ వహిస్తుంది.. అని చెప్పే నాయకుడు కావాలి గానీ.. మీ చావు మీరు చావండి.. మీరు బతికుంటే చాన్సొచ్చినప్పుడు వాళ్లను చంపండి అని సందేశమిచ్చే నాయకుడు తమకు ఎందుకు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మాటలు పార్టీ మీద ఆయన నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయని పలువురు అంటున్నారు. జగన్ మాటలు మరింత మంది కార్యకర్తలు పార్టీ మారేందుకు ప్రోత్సహించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏం సందేశం పంపుతున్నారు జగన్ ?
Friday, December 5, 2025
