వెలంపల్లి ఏడుపు ఏమిటో మరీ విచిత్రం!

Wednesday, October 9, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకరి ఇప్పుడు అతికొద్ది మంది నాయకులు మిగిలారు. మీడియా ముందు మాట్లాడగలిగే నాయకులు చాలా పరిమితంగా ఉన్నారు. అలాగని వీరందరేూ జగన్ మీద భక్తితో ఆ పార్టీలో కొనసాగుతున్న వారు కాదు. సూటిగా చెప్పాలంటే.. జగన్ రకరకాల వికట  ప్రయోగాలలో భాగంగా, తమ మంత్రి పదవులను మధ్యలోనే ఊడపీకినందుకు ఆయన మీద ఆగ్రహంగా కూడా ఉన్నవారే. అయితే.. వారు పార్టీలోనే ఇంకా చెలామణీ అవుతుండడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానమైన కారణం.. వారికి వేరే పార్టీల్లోకి వెళ్లడానికి తగిన అవకాశం లేకపోవడం, గత్యంతరం లేని పరిస్థితి! అలాంటి నాయకుల్లో విజయవాడకు చెందిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.

వెలంపల్లి ఏమాత్రం అర్థంపర్థంలేని ఆరోపణలో విజయవాడ వాసులకు అందించిన వరద సాయం గురించి మాట్లాడుతున్నారు.
బుడమేరు పొంగి విజయవాడ జనజీవనం మొత్తం స్తంభించిపోయినప్పుడు.. సాయం అందించడానికి విరాళాలుగా వసూలు చేసిన డబ్బులను తెదేపా పెద్దలు దారి మళ్లిస్తున్నారని, విజయవాడ బ్రాండ్ ఇమేజిని కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే దెబ్బతీస్తున్నదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటాను అని గతంలో అన్నట్టువంటి చంద్రబాబునాయుడు.. ఇంకో అడుగు ముందుకేసి అవినీతి చేయడానికి అవకాశంగా మార్చుకుంటున్నాడని అన్నారు.

ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు విరాళంగా ప్రకటించిన కోటి రూపాయల సాయం ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడ ఎవరికి ఇచ్చారు? అని నారా లోకేష్ మరియు తెలుగుదేశం నాయకులు ప్రశ్నించడం వలన వచ్చిన కడుపుమంట. వరద బాధితులకు అందరూ సాయం ప్రకటిస్తూంటే జగన్ కూడా, ‘తమ పార్టీ తరఫున’ కోటిరూపాయల విరాళం ప్రకటించారు. ఆ విరాళాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో చెప్పలేదు. ప్రభుత్వానికి ఇవ్వలేదు.

ఆ మరురోజు పార్టీ నాయకులు కొందరు కొన్ని ప్రాంతాల్లో కొంత భోజనం పంపిణీ చేయడం, నీళ్ల బాటిల్లు పంచడం చేశారు. కోటి రూపాయల విరాళం ఎక్కడ జగన్ అని లోకేష్ ప్రశ్నించినందుకు.. వెలంపల్లి మీడియా ముందుకు వచ్చి మేం చేసిన సాయం కనిపించడం లేదా? అని అడుగుతున్నారు. మీరు జేబులోంచి ఒక్కరూపాయైనా పెట్టారా? అని అడుగుతున్నారు. నిజానికి వెలంపల్లి మాటలు సెల్ఫ్ గోల్ లా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా జేబునుంచి పెట్టలేదు. పార్టీ తరఫున ఇస్తున్నట్టు ప్రకటన మాత్రమే చేశారు. విజయవాడ నాయకులను కొన్ని కార్యక్రమాలు చేయమన్నారు. వారు పంచిన భోజనాల ప్యాకెట్లే కోటి లెక్క అని తేల్చేశారు. వైసీపీ నాయకులు ఎవ్వరూ కూడా ఒక్కరూపాయి విరాళం ప్రకటించలేదు. ప్రజలకోసం ఖర్చు పెట్టనూలేదు. అలాంటిది విరాళాలుగా వచ్చిన మొత్తాన్ని పక్కకు మళ్లించి.. తెలుగుదేశం నాయకులు కాజేశారని అనడం చిత్రంగా కనిపిస్తోంది.

వరద సమయంలో వైసీపీ ఎంతగా అంటీ ముట్టనట్టు ఉన్నదో ప్రజలకు తెలుసు. తాము సాయం అందించడానికి పడవ అడిగితే ఇవ్వలేదని ప్రభుత్వం మీద నింద వేస్తున్నారు వెలంపల్లి. ఒక పడవ తెచ్చుకోలేనంత దౌర్భాగ్యస్థితిలో ఆ పార్టీ ఉన్నదా? అని ప్రజల సందేహం. పైగా మోకాళ్ల లోతు నీటిలో నడిచివెళ్లి సాయం చేశామంటున్నారు. ఆ మాత్రం నీరున్నచోట పడవలు ఎందుకు? అని కూడా ప్రజలు అడుగుతున్నారు. మొత్తానికి బాబును తిట్టడానికి ఏదోటి మాట్లాడాలనే యావలో వైసీపీ నాయకులు తమ లోపాలు తామే బయటపెట్టుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles