వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లిలో పర్యటించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్లకుటుంబానికి నిర్దిష్టంగా ఇవాళ్టికి ఉపయోగపడే సాయం ఇసుమంత కూడా లేకుండా.. పార్టీ అండగా ఉంటుందని, వాళ్ల పిల్లలకు ఉద్యోగాలిప్పిస్తామని కబుర్లు చెప్పారు. పనిలో పనిగా.. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు చేస్తున్నదని.. రాష్ట్రంలో జరిగే వ్యవహారాలన్నీ ఏకరవు పెట్టారు. అంతటితో ఊరుకున్నా కూడా సరిపోయేది. కానీ.. అంతకు మించి అతి చేశారు. పోలీసుల మీద అనవసరమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వాళ్లు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారని అనడం మాత్రమే కాదు, మరి కొన్నేళ్లలో తాము మళ్లీ అధికారంలోకి రాగానే.. పోలీసుల బట్టలూడదీయించి కొడతానంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఇలా ఇతర మగాళ్ల బట్టలూడదీయించాలనే కోరిక అంత బలంగా ఉంటున్నదేమిటో.. ఎందుకో.. అంటూ జనం నవ్వుకుంటున్నారు.
మగాళ్ల అందమూ, బట్టలూడదీయడమూ ఒక ముచ్చటగా జగన్ తన ఆలోచనలు బయటపెట్డం ఇది తొలిసారి కాదు. గతంలో దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, నిర్బంధం కేసులో అరెస్టు అయిన వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైలు వద్దకు ములాఖత్ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబుపై లేకి విమర్శలు చేశారు. వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ లాంటి వాళ్లు చంద్రబాబు కంటె, లోకేష్ కంటె అందగాళ్లు అని, వాళ్లు తమకంటె అందంగా ఉంటారు గనుక.. తండ్రీకొడుకులకు అసూయ అని.. అందుకే కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని చవకబారు విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి.
అసలు మగవాళ్ల అందం గురించి ఆయన అంత ప్రత్యేకశ్రద్ధ కనపర్చడమే అప్పట్లో చాలా విమర్శలకు హేళనలకు గురైంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత లాగా.. జగన్ ఇలా అంటోంటే.. ఆయన అనుచరులు కూడా అదే మాదిరిగి రెచ్చిపోతూ వచ్చారు. ప్రస్తుతం పోలీసుల నోటీసులు అందుకోవడానికే జడుసుకుని పరారీలో అజ్ఞాతంలో గడుపుతున్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గతంలో పోలీసుల బట్టలూడదీయించి కొడతానని హెచ్చరించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే డైలాగులు వల్లిస్తున్నారు.
రామగిరి మండలంలో ఎంపీపీ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నించిందని, వారికి ఎస్సై అడ్డదారుల్లో సహకరించారనేది జగన్ ఆరోపణ. అలాంటి ఆరోపణ చేయదలచుకుంటే ఆయనకు చట్టబద్ధ మార్గాలు కూడా ఉన్నాయి. ఏ ఎంపీటీసీలనైతే వీడియో కాల్ చేయించి ఎస్సై బెదిరించారని జగన్ ఆరోపిస్తున్నారో.. అదే ఎంపీటీసీలతో ఎస్సై మీద ప్రెవేటు కేసు పెట్టించి.. నిజాలు తేల్చవచ్చు. అందుకు ధైర్యం లేదు గానీ.. ఏదో జనంతో విజిల్స్ కొట్టించుకోవడమే లక్ష్యం అన్నట్టుగా.. ఎస్సై బట్టలూడదీయించి కొడతాం.. వీధుల్లో నిలబెడతాం.. ఖాకీ బట్టలూడదీయిస్తాం అంటూ హెచ్చరించడం ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి తగదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ కు మగాళ్ల బట్టలిప్పే మోజు ఏమిటో?
Sunday, April 27, 2025
