ఏపీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో హిందూ ఆలయాల కూల్చివేతలు జరుగుతున్నాయని, వైసీపీ హయాంలోనే ఆలయాలను పరిరక్షిస్తూ వచ్చామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘమైన పోస్టును తన ఎక్స్ ఖాతాలో పెట్టుకొచ్చారు. దీనిని గమనిస్తే.. ఏదో ఒక పోస్టు పెట్టాలి.. చాలా కాలం అయిపోయింది.. ప్రజల దృష్టి మళ్లించాలి.. ప్రభుత్వం మీద ఏదో ఒక సాకుతో బురద చల్లాలి.. అనే సంకుచిత లక్ష్యాలు తప్ప.. మరొక కారణం ఉన్నట్టుగా కనిపించడం లేదు. దాదాపు ఇరవైరోజుల కిందట కడపజిల్లాలోని కాశినాయన ఆశ్రమంలో కొన్ని షెడ్లను అటవీ శాఖ అధికారులు అనుమతులు లేనందువల్ల కూల్చేశారు. అయితే ప్రభుత్వం, వెంటనే స్పందించడంతో వాటి పునర్నిర్మాణం కూడా రోజుల వ్యవధిలోనే ప్రారంభం అయిపోయింది. ఇన్నాళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి మేలుకుని.. ప్రభుత్వం మీద బురద చల్లడాన్ని చూసి.. అసలు తమ సొంత జిల్లాలో ఉన్న కాశినాయన క్షేత్రం కోసం తమరేం చేశారు జగనన్నా అని ప్రజలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు.
నల్లమల అడవుల్లో కాశినాయన క్షేత్రం విస్తరించిన దాదాపు 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని 2023 ఆగస్టులో జగన్ సర్కారు కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అక్కడ నిర్మాణాలను నిలిపివేయడం గురించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నోటీసులు ఇచ్చిన తర్వాత.. అక్కడి భక్తులంతా మొర పెట్టుకోవడంతో.. వారి కంటితుడుపు చర్యుగా జగన్ సర్కారు కేంద్రానికి ఆ మేరకు లేఖ రాసి ఊరుకుంది. అంతే తప్ప.. అందుకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపి అనుమతులు వచ్చేలా ఏమాత్రం పట్టించుకోలేదు. మొక్కుబడిగా రాసిన లేఖను మహోపకారం చేసినట్టుగా జగన్ చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుతున్నారు.
అలాగే.. ఆయన సొంత జిల్లాలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయినప్పటికీ.. జగన్ తన పదవీకాలంలో అక్కడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించలేకపోయారనే విమర్శ కూడా ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తాను చేయదగిన కనీస సాయం కూడా చేయకపోగా.. ఇప్పుడు మాత్రం షెడ్లను కూల్చేసి.. హిందూ ధర్మ ద్రోహానికి పాల్పడుతున్నారని అవాకులు చెవాకులు పేలడం సరికాదని ప్రజలు అంటున్నారు.
ఆ క్షేత్రంలో షెడ్లను అటవీశాఖ వారు కూల్చేసిన రోజుల వ్యవధిలోనే ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వమే తిరిగి ఆ నిర్మాణాలు చేపట్టాలని కూటమి ఎమ్మెల్యేలే డిమాండ్ చేశారు. నారా లోకేష్ తన సొంత నిధులతో అవన్నీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి జీరయ్యస్వామికి ఫోను చేసి అటవీశాఖ అధికారుల తరఫున స్వయంగా క్షమాపణలు చెప్పారు. స్వామి కోరిక మేరకు 24 గంటల్లో ఆర్టీసీ బస్సు సదుపాయం కూడా ఏర్పాటుచేశారు. కొత్త షెడ్ల నిర్మాణ పనులు కూడా అప్పుడే ప్రారంభం అయిపోయాయి. అసెంబ్లీకి వెళ్లకుండా ఇన్నాళ్లుగా బయటకూడా ఈ సమస్య గురించి నోరు మెదపకుండా.. ఇప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ ఒక ట్వీటు ద్వారా హిందూ అనుకూల మైలేజీ కావాలని జగన్ కోరుకోవడం చిత్రంగా ఉందని ప్రజలు అంటున్నారు.
కాశినాయనకు తమరేం చేశారు జగనన్నా?
Monday, March 31, 2025
