వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగినరోజుల్లో ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలకు అరాచకాలకు భూకబ్జాలకు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. భూకబ్జాలు అనేవి దాదాపుగా ప్రతి వైసీపీ ఎమ్మెల్యే పరిధిలోనూ చాలా సాధారణమైన విషయాలుగా మారిపోయాయి. అయితే రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ రెడ్డి భూదందాలు మరింత విచిత్రమైనవి. ఆయన తాను ఇతరుల భూమిని కబ్జా చేసి సొంతం చేసుకోవడానికి, మధ్యలో తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా అడ్డుపెట్టుకోవడం అనేది ఇప్పుడు పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయం తన దృష్టికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆశ్చర్యపోవడం విశేషం.
శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో అన్నమయ్య జిల్లా తెదేపా అధ్యక్షుడు తదితరులు కలిసి.. ఎమ్మెల్యే మేకపాటి అమర్నాధ రెడ్డి చేస్తున్న భూకబ్జాల గురించి ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేట మండలం ఆకేపాడులో ప్రెవేటు వ్యక్తులకు చెందిన 5 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ్ రెడ్డి కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలియజేశారు. ముందు ఈ స్థలాన్ని కబ్జా చేసుకుని.. అదే స్థలంలో ఒకటిన్నర ఎకరాలను టీటీడీ పేరిట రాయించి.. దేవస్థానం నిధులతో కల్యాణ మండపం నిర్మించారని, నిర్మాణం పూర్తయిన తర్వాత.. టీటీడీ పేరిట రాసిఇచ్చిన భూమితో సహా మొత్తం ఐదు ఎకరాల భూమిని తన భార్య జ్యోతి పేరుతో ఆకేపాటి అమరనాధరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. తమకు రాసి ఇచ్చిన భూమిని మ్యుటేషన్ చేయించుకోవాలని టీటీడీ ప్రయత్నించినప్పుడు.. రెవెన్యూ అధికారులు తిరస్కరించిన సంగతిని కూడా ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. భూకబ్జాలు చేయడంలో సాక్షాత్తూ తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా అడ్డుపెట్టుకుని దందా చేయడం విని, చంద్రబాబునాయుడే ఆశ్చర్యపోయారు. దీనిపై టీటీడీ చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.
‘ఆవు చేలో మేస్తే .. దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత చందంగా వైసీపీ నాయకుల వ్యవహార సరళి ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తల్లికి గిఫ్టుగా ఇచ్చిన షేర్లను రద్దు చేసి, తిరిగి తనకు ఇచ్చేయాలంటూ ట్రిబ్యునల్ లో దావా నడుపుతున్నారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి ఏకంగా దేవదేవుడికి గిఫ్టుగా ఇచ్చిన భూమిని.. గుట్టు చప్పుడుకాకుండా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకుని.. దేవుడికి మొండిచెయ్యి చూపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
తిరుమల దేవుడిని అడ్డు పెట్టుకుని ఆకేపాటి భూదందా!
Friday, April 18, 2025
