ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ప్రభుత్వంలోని పెద్దలు కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చి వేలకువేల కోట్ల రూపాయల సొమ్ములు కాజేసిన అవినీతి బాగోతంలో కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి ని అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు ఫెయిలయ్యారా? మద్యం డిస్టిలరీల నుంచి వైసీపీ పెద్దలు తీసుకున్న ముడుపులను వసూలు చేయడం- వాటిని మరో కీలక పాత్రధారి పి మిథున్ రెడ్డికి చేర్చడం తదితర వ్యవహారాలలో.. రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు అయిన 50 బృందాలు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు ఇళ్లు తదితర ప్రదేశాలలో సోదాలు సాగిస్తున్నాయి. రాజ్ కసిరెడ్డి పాత్ర నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆయన అదుపులోకి తీసుకుని విచారించే విషయంలో పోలీసులు ఆలస్యం చేశారా? ఆయన జాగ్రత్త పడడానికి పరారీలో వెళ్లడానికి.. లేదా దేశం దాటడానికి కూడా సరిపోయేంత వ్యవధి ఇచ్చి ఆ తర్వాత రంగంలోకి దిగి చోద్యం చూస్తున్నారా? అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.
రాజ్ కసిరెడ్డి కి రెండుసార్లు నోటీసులు సర్వ్ అయిన తర్వాత.. పోలీసులకు ఎదురు ప్రశ్నలు సంధిస్తూ ఒక మెయిల్ పంపి ఊరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో తాను ఐటీ సలహాదారుగా ఉంటే మద్యం కుంభకోణంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి తనను ఎలా విచారిస్తారు అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈలోగా కోర్టుకు వెళ్లారు గాని ముందస్తు బెయలు తెచ్చుకోవడంలో గాని, అరెస్టు నుంచి రక్షణ పొందడంలో గాని ఆయన సఫలం కాలేదు. ఇదే సమయంలో కోర్టు సూచించిన మేరకు ఆయనకు తగిన వ్యవధి ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 9వ తేదీన విచారణకు రావాల్సింది గా పోలీసులు మూడోసారి నోటీసులు ఇచ్చారు. ఆ రోజు నుంచి రాజ్ కసిరెడ్డి విచారణ కు రాకుండా తప్పించుకు తిరుగుతూ పరారీలో ఉన్నారు.
మూడు నాలుగు రోజుల తర్వాత పోలీసులు జాగ్రత్తపడి కసిరెడ్డి కోసం గాలింపులు ముమ్మరం చేశారు. ఈలోగా ఆయన విదేశాలకు పారిపోయే ఉండే అవకాశం ఉంది. అయితే రాజ్ కసిరెడ్డి ఇప్పటిదాకా విదేశాలకు పారిపోలేదని మాత్రం పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మీద చాలా రోజుల కిందటే లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశామనేది వారి వాదన. అంతే తప్ప పరారీలో ఉన్న కసిరెడ్డిని కనిపెట్టేందుకు జరుగుతున్న కృషి మాత్రం పరిమితంగానే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయనను ఎప్పటికి అదుపులోకి తీసుకోగలరో తేలడం లేదు. ఆయనను విచారించడం ద్వారా లిక్కర్ కుంభకోణం అంతిమ లబ్ధిదారులైన వైసీపీ పెద్దతలకాయలు ఎవరనేది ఎప్పటికి నిగ్గు తేలుస్తారో వేచి చూడాలి!
కసిరెడ్డి విషయంలో పోలీసులు లేట్ అయ్యారా?
Sunday, April 27, 2025
