లిక్కర్ కుంభకోణం విషయంలో అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎక్సయిజు మంత్రి కూడా అయిన నారాయణ స్వామిని సిట్ పోలీసులు విచారించారు. పోలీసుల విచారణ తర్వాత, నారాయణ స్వామి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నిజానికి సిట్ పోలీసులు అనూహ్యంగా నారాయణస్వామి ఇంటికి వెళ్లి విచారించడంతో.. ఆయనను తగినంతగా ‘ప్రిపేర్’ చేయడానికి పాపం.. పార్టీ నాయకులకు ఖాళీ దొరికినట్టులేదు. కానీ.. ఆతర్వాత ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించి.. జగన్ తనను ఏనాడూ ఒత్తిడి చేయలేదని చెప్పించే ప్రయత్నం చేశారు.
లిక్కర్ కుంభకోణం ఇప్పుడు రెండో దశ దర్యాప్తులో ఉన్నదని భావించాలి. ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఇందులో భాగం పంచుకున్న నిందితులను విచారించి, వారిలో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు సిట్ పోలీసులు. ఇప్పుడు తెలిసో తెలియకో గాని, పరోక్షంగా గాని మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా విచారించి అదనపు వివరాలను రాబట్టడానికి, లేదా, తమకు తెలిసిన వివరాలను ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే మద్యం కొత్త పాలసీ రూపొందిన నాటికి రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని కూడా సిట్ పోలీసులు విచారించారు. అయితే వీరి విచారణలో నారాయణస్వామి మాత్రం తన జాగ్రత్త తాను చూసుకున్నట్లుగా తెలుస్తోంది. పాలసీ రూపకల్పనలో గాని ఆ తర్వాత అమలు చేసిన తీరులో గాని తన ప్రమేయం ఏమీ లేదని, తనకు ఎలాంటి సమాచారం కూడా లేదని తాను ఎలాంటి లబ్ధి పొందలేదని నారాయణస్వామి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆయన కూడా ఈ అవినీతి సొమ్మును కాజేయడంలో వాటా కలిగి ఉన్నారని పోలీసులు కూడా భావించడం లేదు. కాకపోతే పాలసీని రూపొందించడంలో ఫైనల్ గా సంతకాలు చేయడానికి ఆయన మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అనే దిశగా వివరాలు సేకరించడానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
రాజ్ కెసిరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని మంత్రి నారాయణస్వామి చెప్పడం గమనిస్తే.. అసలు ఎవరి ద్వారా ఈ దందా మొత్తం నడిపిస్తున్నారో.. ఆ సంగతి ఆనవాలు కూడా సంబంధితమంత్రికి తెలియనివ్వకుండా.. దందా నడిపించిన తీరు అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే సిట్ పోలీసులతో విచారణలో ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని చెప్పిన నారాయణస్వామి ఆ తర్వాత, కేవలం జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చీట్ ఇవ్వడం కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చేయాలి అది చేయాలి అని జగన్ తనకు ఏనాడు చెప్పలేదని నారాయణస్వామి సర్టిఫై చేస్తున్నారు. అధికారులు స్టడీ చేసి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మద్యం పాలసీపై కలెక్టివ్ గా నిర్ణయం తీసుకున్నామని నారాయణస్వామి చెబుతున్నారు. తద్వారా పాలసీపై సంతకానికి తనను మాత్రమే బాధ్యుడిని చేయడం కూడా తగదని ఆయన సూచిస్తున్నారు. ఒక స్క్రిప్ట్ కాగితం పట్టుకుని ప్రెస్ మీట్ కు వచ్చిన నారాయణస్వామి అది చదివేసిన తర్వాత ఇక విలేకరులకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోవడం విశేషం. జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చీట్ ఇవ్వడం మాత్రమే లక్ష్యమైన ఆ చీటీ తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
భళా.. ఒకవైపు తన జాగ్రత్త.. మరోవైపు జగన్ కు క్లీన్ చిట్!
Thursday, December 4, 2025
