సరిగ్గా పోల్చి చెప్పాలంటే.. ఏదో పల్లెటూళ్ల నానుబడిలో ఉండే ఒక మొరటు సామెత గుర్తుకొస్తుంది. మమ్మల్ని ఎవరేం చేయగలరు? ఎవరు ఏం అనుకున్నా మాకు ఖాతరు లేదు అని బరితెగించిన వారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు? వారికి ఏం చెప్పగలరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదుడిగా ముద్రపడిన టెక్కలి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు మాధురి ల వ్యవహారం అచ్చంగా ఇలాగే ఉంది. విడివిడిగా తమ జీవిత భాగస్వాములతో విడాకుల కోసం కోర్టుకెక్కి ఎదురుచూస్తున్న ఈ ఇద్దరూ.. తాము టెక్నికల్ గా పెళ్లి చేసుకోవడానికే తప్ప, కలిసి కాపురం చేయడానికి కోర్టు ఇవ్వవలసిన తీర్పుతో అవసరం ఏముందున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇటీవలి కాలంలో భ్రష్టు పట్టించిన వ్యవహారాల్లో టెక్కలి పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కూడా ఒకటి. అధికారంలో కన్నూమిన్నూ కానకుండా చెలరేగిపోయిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్న నాయకుల్లో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుల్లో ఒకరుగానే ఆయన ఉన్నారు. పార్టీ టికెట్ కూడా దక్కించుకున్నారు. పరాజయం పాలయ్యారు. అంతా అయిన తర్వాత.. కుటుంబం రచ్చలు బజారుకెక్కాయి. మాధురితో ఉన్న ప్రేమ వ్యవహారం కాస్తా బజార్న పడింది. భార్య వాణి, కూతుళ్లు ఆమె ఇంటి మీదికి వెళ్లి నిలదీయడం, దువ్వాడ శ్రీనివాస్ భార్యా కూతుళ్ల మీద దాడికి ప్రయత్నించడం అంతా గందరగోళం అయింది.
ఈలోగా ఏ ఆస్తికోసం భార్య రభస చేస్తున్నదో ఆ ఆస్తిని కాస్తా శ్రీనివాస్.. తాను మాధురికి తీర్చవలసిన అప్పుకు బదులుగా ఇచ్చేసినట్టు రిజిస్టరు చేసి దఖలు పరిచారు. మేమిద్దరం లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్ లో ఉన్నాం.. అంటూ ఇద్దరూ ఓపెన్ గానే చెప్పుకున్నారు.
గుట్టుగా ఉండే ఆలాంటి బాగోతం బాగానే రచ్చకెక్కింది. అంతకంటె తెగువగా.. వీరిద్దరూ కలిసి తిరుమల దైవదర్శనానికి కూడా వచ్చారు. వేదపండితులతో ఆశీర్వచనం చేయించుకుని, శేషవస్త్రం కూడా కప్పించుకున్నారు. గుడి బయటకు వచ్చి తామిద్దరమూ తమ తమ భాగస్వాముల నుంచి విడాకుల కోసం ఎదురుచూస్తున్నామని.. ఇద్దరికీ మంజూరైన తర్వాత నిదానంగా పెళ్లి చేసుకుంటామని, అప్పటిదాకా కలిసే కాపురం చేస్తామని మీడియాకు వెల్లడించడం విశేషం.