వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన వ్యవహారం తాజాగా కొత్త చర్చకు దారితీస్తోంది. వైసీపీ ని వీడిపోతున్న నాయకులు ఎలాంటివాళ్లు.. అలాంటి నాయకులు పార్టీని వదలి ఎందుకు వెళుతున్నారు? వారందరూ కేవలం తమ స్వార్థంతో మాత్రమే పార్టీని వదలి వెళుతున్నారా? లేదా, పార్టీ వారికి పొగబెట్టి వెళ్లిపోయేలా చేస్తోందా? అనే రకరకాల చర్చలు పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అంతిమంగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. భజంత్రీలు మాత్రమే కావాలని.. చిత్తశుద్ధితో పార్టీకోసం పనిచేసేవారు, ప్రజల్లో నిజమైన ఆదరణ, మంచిపేరు కలిగిఉన్న వారు ఆయనకు అక్కర్లేదని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు మర్రి రాజశేఖర్ రాజకీయ ప్రస్థానం, నిష్క్రమణే పెద్ద ఉదాహరణ అని కూడా అంటున్నారు.
మర్రి రాజశేఖర్ చిలకలూరి పేటకు చెందిన నాయకుడు. ఆయన 2004 లో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హవా విపరీతంగా పనిచేసిన ఆ ఎన్నికల్లోనూ ఆయన తెలుగుదేశం అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై మర్రి స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2009 ఎన్నికలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది గానీ.. నెగ్గలేకపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఆయన పార్టీ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ ను అంటిపెట్టుకునే ఉన్నారు మర్రి రాజశేఖర్. 2014 లో ఓడిపోయారు. 2019లో జగన్ ఆయనకు అవకాశమే ఇవ్వలేదు. విడదల రజనిని తీసుకొచ్చి నిల్చోబెట్టారు. అధికారం దక్కిన తర్వాత కూడా.. నాలుగేళ్ల దాకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు. చివర్లో ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2024 లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే ఇవ్వలేదు. అలాగని విడదల రజని పట్ల చెడ్డపేరున్నట్టు తెలిసి ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు. చిలకలూరిపేటలో మాత్రం కొత్తగా కావటి మనోహర్ నాయుడును పోటీకి నిలిపారు. ఆయన ఓడిపోవడం జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జిని మార్చదలచుకున్న జగన్.. కనీసం మర్రికి మాట మాత్రం చెప్పకుండా.. విడదల రజనిని మళ్లీ తీసుకువచ్చి అక్కడే నియమించారు. ఇవన్నీ రాజశేఖర్ ను బాధించాయి.
జగన్ పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేసే.. ప్రజల్లో ఉండే నాయకుడు అయిన మర్రి రాజశేఖర్ వంటి వారిని పట్టించుకోవడం లేదని.. మీడియా ముందు జగన్ భజన చేస్తూ.. అడ్డగోలు అవినీతి పనులకు పాల్పడుతూ.. పార్టీ పరువు తీస్తూ ఉండే.. విడదల రజని వంటి వారిని మాత్రం ప్రోత్సహించడం పార్టీ కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు. విడదల రజని.. జగన్ ను కీర్తించడానికి ఆమె ప్రాధాన్యం ఇస్తుంటారు. జగన్ కు అలాంటి చర్యలే రుచిస్తున్నాయి తప్ప.. మర్రి రాజశేఖర్ తరహాలో సైలెంట్ గా ప్రజల్లో తన పని తాను చేసుకుపోయే వారు ఆయనకు నచ్చరని కార్యకర్తలు వాపోతున్నారు.
భజంత్రీలే కావాలి.. జగన్‌కు గట్టివాళ్లు అక్కర్లేదు!
Saturday, March 22, 2025
