ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడున్నరేళ్ల నా గత ప్రభుత్వ హయాంలో దారుణమైన హత్యకు గురయిన సొంత బాబాయ్, మాజీ మంత్రి డా. వై ఎస్ వివేకానంద రెడ్డి హంతకుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా సొంత కుటుంబంలోనే ఈ ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తూ ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర టిడిపి నాయకులే తన బాబాయిని హత్య చేశారనే తీవ్రమైన ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన జగన్ అధికారంలోకి రాగానే దర్యాప్తును నీరు కారిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె, వరుసకు చెల్లెలు డా. సునీత హైకొర్టును ఆశ్రయించగా, జగన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
జగన్ అడ్డుకొనే ప్రయత్నం చేసినా సీబీఐ దర్యాప్తు ప్రారంభమయింది. అయితే దర్యాప్తు ముందుకు వెళ్లకుండా జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తుంది అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ వేరే రాష్ట్రంలోని హైకోర్టుకు బదిలీ చేయాలని కోరడం జరిగింది.
ముఖ్యంగా ఈ కేసులో సీబీఐ అనుమానాలు జగన్ కు సన్నిహితుడైన వరుసకు తమ్ముడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబం వైపు వెడుతూ ఉండడం, సిబిఐ సహితం వారిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నదని కధనాలు వ్యాపించడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లిన డా. సునీత సహితం కడప ఎంపీ సీటు విషయంలో తమ కుటుంభంలో కలతలు చెలరేగాయని పేర్కొనడం ద్వారా తాను ఎంపీగా పోటీ చేయడం కోసం అవినాష్ రెడ్డి తన తండ్రిని అడ్డుతొలిగించుకొనే ప్రయత్నం చేశారనే వాదనకు బలం చేకూర్చే విధంగా వ్యవహరించారు.
చివరకు జగన్ సొంత చెల్లెలు, వై ఎస్ షర్మిల సహితం కడప సీట్ విషయమై వివాదాన్ని నిర్ధారణ చేసే విధంగా మాట్లాడటంతో జగన్ ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులలో జగన్ `ఆతరక్షణ చర్యలు’కు పాల్పడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. సిబిఐ దారి మళ్ళించడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
వివేకానందరెడ్డి కుటుంభం సభ్యుల మధ్య ఏర్పడిన ఆస్తి తగాదాలే హత్యకు కారణం అనే విధంగా సాక్ష్యాలు పుట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఆయన హత్యకు దారి తీశాయని వాదనను తెర మీదకు తీసుకు వస్తున్నారు.
రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు ఆమె కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడం ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తీవ్ర ఆందోళన కలిగించిందని ఆరోపణలు చెలరేగడం గమనార్హం.
ఈ కేసులో అరెస్టైన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో ఆ మేరకు శనివారం సంచలన వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ తీరును తప్పుబడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ వివేకాను వదిలిపెట్టాలని షమీమ్‌ను ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత బెదిరించారని తులసమ్మ చెప్పారు. షమీమ్‌కు జన్మించిన కుమారుడినే తన చట్టబద్ధమైన వారసుడిగా ప్రకటిస్తానని వైఎస్ వివేకానంద రెడ్ తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో ఆ వివాదం మరింత ముదిరిందని ఆమె పేర్కొన్నారు.
ఆయనకు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా క్షీణించాయని ఆమె తెలిపారు. వివేకానంద ఆస్తికి వారసులు కావాలని ఆయన అల్లుడు రాజశేఖర్, శివప్రకాశ్ ఆశించారని, కానీ షమీమ్ కుమారుడికి ఆస్తి రాసిస్తానని చెప్పడంతో వివేకాపై వారు పగ పెంచుకున్నారని తులసమ్మ తన పిటిషన్‌లో ఆరోపించారు.
అంతేకాదు పులివెందులకు చెందిన పరమేశ్వర రెడ్డికి వివేకానందతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తులసమ్మ ఆరోపించారు. బెంగళూరులో భూ ఒప్పందం ద్వారా వచ్చిన సొమ్ములో తనకు వాటా ఇవ్వనందుకు వివేకానందపై ఆయన కూడా పగ పెంచుకున్నాడని తెలిపారు. వివేకా కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పులివెందులకు చెందిన ఎన్ ప్రసాద్‌ను ఇతర నిందితులు మోహరించినట్లు ఆమె వెల్లడించారు.
ఎం రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బిటెక్ రవి, అనంతపురంకు చెందిన వైజీ రాజేశ్వర రెడ్డిలకు వివేకానంద రెడ్డితో రాజకీయ విభేదాలు ఉన్నాయని తులసమ్మ ఆరోపించారు. ప్రత్యర్థిని వైసిపి గూటికి తీసుకురావాలని ప్రయత్నించడంతో వివేకానందరెడ్డిపై వైజీ రాజేశ్వర రెడ్డి పగ పెంచుకున్నారని ఆమె తెలిపారు.
సీబీఐ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా, పక్షపాతంగా, అన్యాయంగా ఉందని తులసమ్మ ఆరోపించారు. హత్యలో నిజమైన నిందితులను రక్షించేందుకు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాని ఆమె చెప్పారు. మొత్తమ్మీద, దర్యాతులో ముందుకు పోకుండా సిబిఐని కట్టడి చేసేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.