వివేకా హత్య కేసు తెలంగాణకు మార్చడంతో జగన్ పై `సుప్రీం’ అభిశంసన!

Friday, December 20, 2024

మాజీ మంత్రి, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నివ్వడంతో సీబీఐ దర్యాప్తును దారి మళ్లించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆత్మరక్షణలో పడవేసిన్నట్లు చెప్పవచ్చు. కీలకమైన దోషులకు జగన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చిన్నట్లయింది.

‘‘సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?’’ అని టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. దీనిపై తన కేబినెట్ మంత్రులతో మాట్లాడిస్తే సరిపోదని, ఆయనే స్వయంగా మాట్లాడాలని స్పష్టం చేశారు.

వివేకానంద రెడ్డి కుమార్తె, వరుసకు జగన్ కు చెల్లెలు డా. సునీత రెడ్డి నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు నివ్వడం గమనార్హం. ఈ సందర్భంగా చేసిన వాఖ్యలు జగన్ ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం అభిశంసించడంగానే పలువురు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రయల్ కోర్టులో జరుగుతున్న నేర విచారణ నిష్పాక్షికంగా, స్వతంత్రంగా జరగడం లేదన్న పిటిషనర్ సునీత వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ, హత్య వెనుక విస్తృతస్థాయిలో జరిగిన కుట్ర, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశించింది.

తెలంగాణకు విచారణను మార్చడం కన్నా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వాఖ్యలు జగన్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఏ కేసులోనైనా స్వతంత్రంగా, నిష్పాక్షింగా నేర విచారణ జరపాలని కోరుకోవడం బాధితుల ప్రాథమిక హక్కు అని ధర్మాసనం పేర్కొంది.

“మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య సుప్రీంకోర్టు వరకూ రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతుంది. విచారణపై వాళ్లిద్దరూ అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తున్నాం. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టుగా కూడా కనిపించాలి. హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలున్నాయి. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం” అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

“ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉంది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న విస్తృతస్థాయి కుట్ర బయటకు రావాలంటే తదుపరి లోతైన దర్యాప్తు కొనసాగాలి. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో నేర విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నాం. అందుకే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం” అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొనడం జగన్ పాలనా వ్యవహారాలపై అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన తీవ్రమైన అభిప్రాయాలుగానే పరిగణింపవలసి ఉంటుంది.

కేసు విచారణ సందర్భంగా సాక్షులనే కాదు దర్యాప్తు జరుపుతున్న అధికారులను సైతం నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషనర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు.  కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కేసులో ప్రతివాదులైన సీబీఐ సైతం హత్యకేసు విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలపడం గమనార్హం.

ఈ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాక్షిగా విచారిస్తే త్వరగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు చెప్పారు. న్యాయం చేయడమే కాదు.. న్యాయం చేసినట్లు కనిపించాలన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. లేకపోతే కొన్ని అనుమానాలు చరిత్రపుటల్లో అలాగే నిలిచిపోతాయని స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles