విజయసాయి ఉవాచ : జగన్ ఎలా మునిగారంటే..!

Sunday, March 16, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరాజయం అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉన్నంత వరకు ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఒక దఫా 175లో 151 స్థానాలు గెలుచుకుని రికార్డు స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. అదే మొదలుగా 30 ఏళ్లపాటూ తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నానని చాలా ఘనంగా ప్రకటించుకున్న వ్యక్తికి చెందిన పార్టీ.. కేవలం అయిదేళ్ల పాలనతో అతి భయంకరమైన అపకీర్తిని మూటగట్టుకుని.. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కేవలం 11 సీట్లకు పరిమితం కావడం అనేది చరిత్రలో ఎన్నడూ ఎరగని సంగతి. ఫలితాలు వెలువడే క్షణం వరకూ.. తామే మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం అంటూ విర్రవీగిన వారికి,  ఇంత దారుణ పరాజయం ఎలా సంభవించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వైఎస్ జగన్ ఓటమిపై ఇప్పటికీ రకరకాల విశ్లేషణలు సాగుతూనే ఉన్నాయి. అయితే.. బయటివాళ్లు చేసే విశ్లేషణలు వేరు.. జగన్ కు అత్యంత ఆంతరంగికుడు, ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ క్షుణ్నంగా అతి సమీపంనుంచి గమనిస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి చేయగల విశ్లేషణ వేరు! ఆయన చెప్పే విశ్లేషణకు చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టీలోంచి బయటకువ చ్చిన విజయసాయి.. జగన్ ఎలా మునిగిపోయాడో తనదైన శైలిలో చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇలా సాగుతుంది..

‘‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది.  దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే!’’

జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉన్నదని, ఆ కోటరీ ఆయన సమీపానికి ఎవ్వరినీ వెళ్లనివ్వదని, జగన్ ను ఎవరైనా కలవాలనుకుంటే కూడా ముందుగా తమ స్వార్థం చూసుకుంటుందని విమర్శించిన కొన్ని రోజుల వ్యవధిలోనే.. జగన్మోహన్ రెడ్డి.. వందిమాగధుల మాటలకు లోబడి.. తనకు తాను చేటు చేసుకునే రాజరికపు ప్రతినిధిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ పెట్టడం గమనించాల్సిన సంగతి. జగన్ కళ్లకు గంతలు కట్టి కోటరీ వ్యవహారాలు నడిపిస్తున్నదని విజయసాయి ఆరోపిస్తున్నారు. జాగ్రత్తపడి.. మారువేషాల్లోనైనా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకుంటూ పాలన చేయాల్సిన రాజు విలపలమవుతున్నారని విజయసాయి ఆరోపిస్తున్నారు. జగన్ తీరు మారకుంటే.. ‘‘కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు..’’ అని విజయసాయి హెచ్చరించడాన్ని గమనిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అంతర్ధానం అయిపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles