వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నోట్లో మట్టి పడుతుందనే భయం ఆ పార్టీ అభ్యర్థుల్లోనే కనిపిస్తోందా? జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ఓట్లు రాలుతాయనే నమ్మకం వారెవరిలోనూ కూడా లేదా? జగన్ మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ప్రజలను ఆకర్షించడానికి తమంత తాము ఏదో మాయమాటలు చెబితే తప్ప గట్టెక్కలేమనే భయం వారిలో పుడుతోందా? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనను తాను కాపాడుకోవడానికి ఒక సొంత మానిఫెస్టో తయారు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించడం గమనార్హం.
నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేశామని విజయ సాయి రెడ్డి ఆత్మకూరులో విలేకరుల సమావేశం తో మాట్లాడుతూ చెప్పారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేయగా జిల్లా కోసం ప్రత్యేకంగా మరొక మేనిఫెస్టో అంటే వారి ఉద్దేశం ఏమిటి? విజయసాయి రెడ్డి చెబుతున్న నెల్లూరు జిల్లా మేనిఫెస్టో తరహాలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన మేనిఫెస్టోలను విడివిడిగా తయారు చేస్తుందా? లేదా నెల్లూరు జిల్లా ప్రజలను మాత్రం మభ్యపెట్టడానికి విజయసాయిరెడ్డి ఇలాంటి ఎత్తు వేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వలన ఓట్లు రాలవనే భయంతో ఆకర్షకమంత్రాలు తన సొంత పద్ధతిలో ప్రకటిస్తున్నారా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా కోసం సొంతంగా ఒక మేనిఫెస్టో చేశారే అనుకుందాం. ఆయనను ఎంపీగా గెలిపించినంత మాత్రాన ఆ మేనిఫెస్టోలో అంశాలను ఎలా నెరవేరుస్తారు? అవన్నీ కేంద్రంతో ముడిపడిన కేంద్రం నుంచి సాధించుకు రావాల్సిన వ్యవహారాలు మాత్రమేనా? జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలు లేకుండా ఆయన తన తాను విడుదల చేసిన మేనిఫెస్టోలో వీటి గురించి ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి ఓట్ల కోసం మాయ చేయడానికి చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు. ఈ హామీలకు పూచీ ఇచ్చేది ఎవరు? ఎలా నమ్మడం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
విజయసాయి రెడ్డి సొంత మేనిఫెస్టో తయారు చేసుకోవడం అంటే.. దాని అర్థం పార్టీ తయారు చేసిన మేనిఫెస్టో ప్రజారంజకంగా లేదని వారు భయపడుతున్నట్లే లెక్క అనే విమర్శలు వస్తున్నాయి. ఒక కొత్త హామీ కూడా లేకుండా చంద్రబాబు చేస్తానంటున్న వాగ్దానాలలో కనీసం ఐదు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వకుండా తీసుకువచ్చిన మేనిఫెస్టో పార్టీని ముంచడానికి తయారైనట్లుగా ఉన్నదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.
జగన్ ను నమ్మలేక విజయసాయి సొంతదారి!
Tuesday, November 5, 2024