కొన్ని నెలలుగా మరుగున పడిన హాట్ టాపిక్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కలిగి ఉండే.. వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తుల పంపకం గొడవలు ఎక్కడిదాకా వచ్చాయి? తల్లికి చెల్లికి రాసిఇచ్చిన వాటాలను కూడా తిరిగి తనకు వెనక్కు ఇప్పించాలని జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ లో వేసిన దావాలు ఏమైనట్టు? ఈ చర్చ కొన్ని నెలలుగా ప్రజల్లో మరుగున పడింది. తాజాగా వైఎస్ షర్మిల మళ్లీ ఆ తేనెతుట్టెను రేపారు. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. తన ఇంటికి వచ్చి గంటల పాటు సాగించిన భేటీలో.. ఈ వివాదం గురించి వెల్లడించిన వివరాలను ఆమె స్వయంగా బయటపెట్టారు. విలేకరులకు నిర్ధరణ కావాలనిపిస్తే.. విజయసాయినే డైరక్టుగా అడిగి తెలుసుకోవచ్చునని కూడా అన్నారు. ఇప్పుడు చూడబోతే.. ఆస్తుల పంపకాల కేసు ముందుముందు అనేక మలుపులు తిరగబోతున్నట్టు అనిపిస్తోంది. ట్రిబ్యునల్ ఎదుట విజయసాయిరెడ్డి సాక్షి గా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబానికి చెందిన సమస్త ఆస్తులు.. వాటిని ఎవరి పేరు మీద ఉంచినా సరే.. ఇద్దరు పిల్లలకు సమానంగా చెందాలని కోరుకుంటున్నట్టుగా ఆయన భార్య విజయమ్మ చెబుతూ వచ్చారు. అయితే జగన్ వర్గం వాదన వేరే. జగన్ పేరిట ఉన్న ఆస్తులన్నీ ఆయన కష్టపడి సొంతంగా తయారుచేసుకున్నవే.. వాటిలో కూడా షర్మిల వాటా అడిగితే ఎలా? అని వారు అంటారు. జగన్ చెమటోడ్చి చేయలేదు కదా.. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాపకం వల్లనే, ఆయన ద్వారానే చేశారు గనుక.. అవన్నీ కుటుంబ ఆస్తులే అనేది షర్మిల వాదన. మొత్తానికి కుటుంబంలో జరిగిన పంచాయతీ పర్యవసానంగా తల్లి చెల్లెళ్లకు ఆస్తులు పంచిన జగన్.. అవి తనకు వెనకకు కావాలంటూ ట్రిబ్యునల్ కు వెళ్లాక గొడవ ముదిరి పాకాన పడింది. షర్మిల, విజయమ్మ కూడా తీవ్రమైన విమర్శలు చేయడంతో.. వారి కుటుంబ ఆడిటర్ విజయసాయిరెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి.. షర్మిల మాటలు అబద్ధాలని చెప్పారు.
అయితే జగన్ ఒత్తిడిచేసి ఆయనతో అలా చెప్పించినట్టుగా షర్మిలతో అన్నారట. ఆయన ఒప్పుకోకపోయినా వైవీ సుబ్బారెడ్డిని రాయబారం పంపి మరీ బలవంతంగా చెప్పించారని విజయసాయి షర్మిలతో చెప్పారట. అయితే ఆయన మీడియా ముందు మాత్రం స్వయంగా చెప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ట్రిబ్యునల్ ఎదుట విజయసాయిరెడ్డిని సాక్షిగా షర్మిల వాడుకునే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె అభ్యర్థను ఆయన ఓకే చెప్పినట్టుగా సమాచారం. విజయసాయి సాక్షి అయితే.. జగన్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు.
అన్నా చెల్లెళ్ల ఆస్తి తగాదాలో సాక్షిగా విజయసాయి!
Monday, March 31, 2025
