విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రజలలో రకరకాల అభిప్రాయాలను కలిగిస్తోంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావలాగా మారుతుండగా సీనియర్ నాయకులు ముందుగానే తట్టా బుట్టా సర్దుకుని జాగ్రత్త పడడం.. ఆశ్చర్యకరమైన పరిణామం కాదని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంకా మూడేళ్ల పాటు రాజ్యసభ ఎంపీ హోదా ఆయనకు ఉన్నప్పటికీ ఇప్పుడు రాజీనామా చేయడం రకరకాల అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఎంపీ అయిన నాటి నుంచి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులతో వ్యక్తిగతంగా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎంతో చురుగ్గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి– ఆ పార్టీకి మేలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడం వలన అనివార్యంగా ఈ స్థానానికి ఉప ఎన్నిక వస్తుంది. రాష్ట్రంలో రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే కనీసం పోటీకి అభ్యర్థిని నిలబెట్టే బలం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అంటే, మరొక ఎంపీ స్థానం ఎన్డీఏ కూటమి అమ్ముల పొదిలోకి చేరుతుంది. కీలకమైన బిల్లులను నెగ్గించుకోవడానికి రాజ్యసభలో బలం తక్కువైన స్థితిలో ఉన్న ఎన్డిఏ దేశవ్యాప్తంగా అవకాశం ఉన్న చోట ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి లేదా బెదిరించి రాజ్యసభలో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉందనే వాదనలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై ఉన్న అవినీతి, అక్రమార్జనల కేసుల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తే చాలు.. ఇక రాజకీయాల జోలికి రాను అనే ఏకైక ఒప్పందంతో విజయసాయిరెడ్డి తనంతగా వెళ్లి బిజెపి వారితో డీల్ కుదుర్చుకుని ఆమేరకు రాజీనామా చేశారేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన అన్ని అక్రమార్జనల కేసులలో విజయసాయిరెడ్డి కూడా సహనిందితుడు. ఇవి మాత్రమే కాకుండా వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక అనేక అక్రమ వ్యవహారాలలో విజయసాయి రెడ్డి పాత్ర పై కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాకినాడ పోర్టు వాటాలను బెదిరించి దక్కించుకోవడం ఒక తాజా ఉదాహరణ. ఎంతగా మేకపోతు గాంభీర్యపు మాటలు పలికినప్పటికీ ఆ కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని భయం పుట్టిన తర్వాతనే పోర్టు వాటాలన్నింటినీ తిరిగి కె.వి. రావుకు కట్టబెట్టేశారని ప్రచారం కూడా ఉంది. వాటాలు తిరిగిచ్చినంత మాత్రాన కేసులు వదిలి పోతాయనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో ‘కేసుల విషయంలో కాస్త ఉదాసీనంగా ఉంటే చాలు నేను ఇప్పుడే రాజ్యసభ పదవి నుంచి తప్పుకొని మీ కూటమికి ఆ పదవి దక్కేలా సహకరిస్తాను’ అనే ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకున్నారేమో అనేది వైసీపీ శ్రేణులు అనుమానంగా కూడా ఉంది. ఏ సంగతీ నెమ్మదిగా వెలుగులోకి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.