వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ వ్యవహారం ఏపీలోని అధికార పక్షంలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల వైసిపి ప్రధాన కార్యాలయంలోనే ఈ ఫోన్ పోవడం మరింత విస్మయం కలిగిస్తున్నది. ఆ ఫోన్ నిజంగా పోయిందా? అందులోని కీలకమైన సమాచారాన్ని మాయం చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి హైజాక్ చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో, తాజాగా హైదరాబాద్ లోని ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో నిందితుల మొబైల్ ఫోన్ల డేటా ఆధారంగా దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించడం, ఆ మేరకు కొత్త, కొత్త నిందితులను గుర్తించడం జరుగుతూ ఉండడం తెలిసిందే.
ఢిల్లీ మద్యం కుంభకోసంలో విజయసాయిరెడ్డి అల్లుడు అన్నగారైన శరత్ చంద్రారెడ్డిని కీలక నిందితుడిగా ఈడీ గుర్తించి, ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంచడంతో వైసిపి కీలక నేతలలో ఖంగారు బయలుదేరినట్లు చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ లో ఢిల్లీ మద్యం కుంభకోణంతో పాటు ఏపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు సంబంధించిన కీలక సమాచారం ఉండవచ్చని, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు ప్రమేయం గల సమాచారం ఉండవచ్చని, అందుకనే దానిని ఉద్దేశ్యపూర్వకంగా జగన్ మాయ చేసి ఉండవచ్చని టిడిపి నేతలు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అధికార వైసీపీ పాత్ర ఉంది అంటూ ఈ సందర్భంగా విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు శరత్ చంద్రారెడ్డిని తాజాగా ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడిగా భావించే వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలవడం సహితం రాజకీయంగా కలకలం రేపుతున్నది.
శరత్ చంద్రారెడ్డి చెవిలో ‘ఏమీ చెప్పొద్దు’, `ఎవ్వరి పేరు చెప్పవద్దు’ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పి ఉంటారా? అంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శల వేడి తెల్లారకముందే విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారంకు దారితీస్తుంది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి లోకేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న ఫోన్ పోయిందంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
టెక్నాలజీ ఆధారంగా విజయసాయిరెడ్డి ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులు వెదుకుతున్నారు. విజయసాయిరెడ్డి వాడుతున్నది లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ అని సమాచారం..ప్రతిరోజూ ఆయన్ను వందలాది మంది కార్యకర్తలు కలుస్తుంటారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు.
ఈ క్రమంలో ఆయన ఫోన్ మిస్ అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకతాయిలు ఎవరైనా తీశారా? దొంగలు చొరబడ్డారా? లేక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదని, కావాలనే ఆయన ఫోన్ మిస్ అయినట్లు నటిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని పోలీసులు విచారిస్తున్న సమయంలో ఇలా జరగడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇచ్చిన ఓ ట్వీట్ లో “ఏ 2 ఫోన్ పోలేదు… పడేసాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం తో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయి… అందుకే విజయసాయిరెడ్డి తన ఫోన్ పడేసుకున్నారని ఆరోపించారు. సినిమా లాని కొన్ని సీన్లను ఫాలో అయ్యి.. ఇలా దొంగ డ్రామాలు ఆడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునే ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.