ఆయనకు రాజకీయం ప్రధానం కాదు. ఆత్మీయత ఒక్కటే కొలబద్ధ. ఆత్మీయులకోసం మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ రంగుల కండువాలను తన భుజాల మీద వేసుకోవడం లేదు. ఎందుకంటే.. ఆయన వేర్వేరు చోట్ల వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు. ఆయన మరెవ్వరో కాదు. హీరో.. విక్టరీ వెంకటేష్! తెలంగాణలో తన వియ్యంకుడు రఘురాంరెడ్డికి అనుకూలంగాను, అటు ఆంధ్రప్రదేశ్ లో తన మిత్రుడు కామినేని శ్రీనివాస్ కోసం వెంకటేష్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు కొంతకాలం రాజకీయాల్లో చురుకైన పాత్రనే పోషించారు. కానీ.. ఆయన తర్వాత.. కొడుకులిద్దరూ రాజకీయాల జోలికి రాలేదు. ప్రత్యేకించి నిత్యం తాత్వికమైన స్పృహతోఉండే విక్టరీ వెంకటేష్ అసలు రాజకీయ వాసనల వైపు కూడా వచ్చిన మనిషి కాదు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు పొలిటికల్ ప్రముఖులను కలవడానికి వెళ్లిన ఏ సందర్భంలో కూడా విక్టరీ వెంకటేష్ వెళ్లిన దాఖలాలు లేవు. తన సినిమా టికెట్ల ధరలు పెంచుకోడానికి అనుమతులకోసం కూడా ఆయన సీఎంలను కలిసిన దాఖలాలు లేవు. రాజకీయంగా ఆయన పూర్తిగా టచ్ మీ నాట్ గానే ఉంటూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన తప్పనిసరిగా ఎన్నికల ప్రచారానికి వెళ్లి తీరాల్సిన అవసరం ఏర్పడింది.
తెలంగాణ ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి పోటీచేస్తున్న రఘురాం రెడ్డి, స్వయంగా వెంకటేష్ కు వియ్యంకుడు. వెంకటేష్ పెద్దకూతురిని రఘురామిరెడ్డి పెద్ద కొడుకుకు యిచ్చి పెళ్లిచేశారు. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా వియ్యంకుడే. కాగా వెంకటేష్ కూతురు ఖమ్మం ఎంపీ పరిధిలో రోజువారీ ఎన్నికల ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. వియ్యంకుడు గనుక విక్టరీ వెంకటేష్ కు కూడా తప్పలేదు. ఆయన కూడా ఖమ్మం వెళ్లి రఘురాంరెడ్డికి అనుకూలంగా రోడ్ షోలు నిర్వహించారు. అనుకూల ప్రచారం చేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి పార్టీ మారాల్సి వచ్చింది. అక్కడ కైకలూరు ఎమ్మెల్యేగా కూటమి తరఫున బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వెకంటేష్ కు ఆత్మీయులు దానితో ఆయన విజయం కోసం కూడా వెంకటేష్ ఏలూరుజిల్లా కలిదిండిలో ప్రచారం నిర్వహించారు. కైకలూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ కామినేనిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని వెంకటేష్ కోరారు.
మొత్తానికి పార్టీ రంగు తనకు అంటకుండా.. ఇరు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించిన విక్టరీ వెంకటేష్ ఆయా అభ్యర్థులకు విక్టరీని అందిస్తారా లేదా వేచిచూడాలి.
విక్టరీ ప్రచారం: ఇక్కడ కాంగ్రెస్.. అక్కడ బిజెపి కోసం!
Sunday, December 22, 2024