ఈ సంవత్సరం టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఒకటి. ఈ సినిమా సక్సెస్ తరువాత వెంకటేశ్ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. ఎవరితో పనిచేస్తారన్న ఆసక్తి మధ్య, చివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త సినిమా చేయనున్నట్లు ఫిక్స్ అయింది.
ఇంతకు ముందు వెంకటేశ్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు కానీ, ఈ సారి మాత్రం ఆయనే స్వయంగా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. అందువల్ల ఈ కలయిక ప్రత్యేకంగా మారింది. తాజాగా ఈ చిత్రానికి ముహూర్త కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు నిర్మాతలు చినబాబు, నాగవంశీతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు హాజరయ్యారు. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుందని మేకర్స్ వెల్లడించారు.
