ఉపరాష్ట్రపతి పదవి కాలం పూర్తయిన నాలుగు నెలలోనే పదవి లేకుండా ఖాళీగా అందవలసి రావడంతోనే ఎం వెంకయ్యనాయుడు అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. తనకు గల సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవంను పట్టించుకోకుండా, దేశ రాజకీయాలలో అప్రతిహతంగా వెలిగిపోతున్న తన పార్టీ, ప్రభుత్వం తనను ఖాళీగా ఉంచడం తట్టుకోలేక పోతున్నట్లు స్పష్టం అవుతున్నది.
అందుకనే, పదవీ విరమణ చేసిన తరువాత ఖాళీగా ఉండలేనని మాజీ తాజాగా స్పష్టం చేశారు. త్వరలోనే ప్రజల మధ్యలోకి వస్తానని కూడా ప్రకటించారు. అయితే, రాజకీయాల గురించి మాట్లాడుతా కానీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు.అంటే, తనకు ఖాళీగా ఉంచితే అధికార పక్షం ఇరకాటంలో పడవలసి వచ్చేటట్లు చేస్తానని పరోక్షంగా బిజెపి అధిష్టానికి సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.
కేంద్ర మంత్రిగా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో కీలక పాత్ర వహిస్తున్న సమయంలో హోదా తప్ప అధికారంల్లేని ఉపరాష్ట్రపతి పదవికి పంపుతున్నప్పుడే అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ పదవికి ఒప్పుకోనని పక్షంలో, ఉన్న మంత్రి పదవిని కూడా కోల్పోవలసి వస్తుందనే సంకేతం ఇవ్వడంతో అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఐదేళ్లు ఉప రాష్ట్రపతి పదవిలో ప్రజల దృష్టిలో కొనసాగే విధంగా గడిపిన తరువాత రాష్ట్రపతిగా పదవోన్నతి లభిస్తుందని ఆశించారు.
అయితే రాష్ట్రపతి పదవి దక్కక పోవడంతొ, కనీసం ఉపరాష్ట్రపతిగానే మరో ఐదేళ్లు కొనసాగిస్తారని ఎదురు చూశారు. కానీ నిర్ధాక్షిణ్యంగా పంపి వేయడంతో పాటు, ఆ తర్వాత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో తనను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉండడంతో అసహనంకు గురవుతున్నారు.
అందుకనే, క్రియాశీలంగా ప్రజల మధ్యకు వెడుతూ ప్రాధాన్యత గల అంశాలను ప్రస్తావించబోతున్నట్లు తన అజెండాను సహితం వెల్లడించారు. రాజకీయాల్లో క్రిమినల్ చరిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోందని, ఇది స్వచ్ఛ రాజకీయాలకు మంచిది కాదని స్పష్టం చేశారురు. ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులపై ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసి, నిర్దిష్ట కాలపరిమితిలో వాటి విచారణను ముగించాలని చెప్పారు.
అదేవిధంగా, చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాల్సిన అవసరం ఉందని, దీన్ని సాగదీయడం ఎంతమాత్రం సబబు కాదని తేల్చి చెప్పారు. సహజంగానే ఈ అంశాలు అన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వపు అవకాశవాదాన్ని తేల్చిచెప్పేవే కావడం గమనార్హం.
గతంలో రాజకీయాలు బాగుండేవని ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా వర్తమానపు రాజకీయాలపై, ముఖ్యంగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్న బిజెపి తీరుతెన్నులపై తన అసంతృప్తిని వెల్లడించినట్లు అయింది.