జగన్ మళ్లీ గెలుస్తారు.. మళ్లీ అధికారం చేపడతారు.. అనే నమ్మకం ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకుల్లో అయినా ఉండడం సహజం. ఇంకా సూటిగా చెప్పాలంటే అలాంటి నమ్మకం ఉండితీరాలనే నిబంధన ఏమీ లేదు. ఇతర పార్టీల్లోకి దూరడానికి తమకు నో ఎంట్రీ బోర్డు ఎదురవుతున్నప్పుడు కూడా.. వారు జగన్ మీద అపరిమిత భక్తిని నటించడం కొనసాగిస్తుంటారు. ఈ రెండు కారణాల్లో ఏ కారణం చేత ఆయన పూనుకున్నారో గానీ.. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ గన్నవరం విమానాశ్రయం వద్ద ఓవరాక్షన్ చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడడానికే ఆయన ఇలా అతి చేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి.
ఓడిపోయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి.. రెండురోజులు తాడేపల్లి ప్యాలెస్ లో గడిపితే వారం రోజులు బెంగుళూరు ప్యాలెస్ లో అన్నట్టుగా గడుపుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నవాబుపేట ఘర్షణల్లో పార్టీ వారు గాయపడితే.. పరామర్శించడానికి జగన్ వచ్చారు. అసలే విపరీతమైన పబ్లిసిటీ పిచ్చితో వెంపర్లాడే జగన్ కు స్వాగతం చెప్పడానికి కార్యకర్తలు పోటెత్తారు. ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉంటూ తర్వాతి పరిణామాల్లో కొంత కాలం బిజెపిలో ఉండి, గతంలో జగన్ చెంతకు చేరి.. మంత్రి పదవిని అనుభవించి.. ఆ తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి అవకాశమే లేకుండా మిగిలిపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా.. తన మందీ మార్బలంతో ఎయిర్ పోర్టుకు వచ్చారు.
భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఒక కారుకు మించి అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నాలుగు కార్ల జనంతో అక్కడకు చేరుకున్న వెలంపల్లి, తన కారుతో పాటూ అనుచరుల మూడు కార్లను కూడా లోనికి పంపాల్సిందే అంటూ భీష్మించుకున్నారు. కారు దిగి పోలీసులతో గొడవపడడం మాత్రమే అక్కడే రోడ్డుపై బైఠాయించి హైడ్రామా నడిపించారు. మంత్రిగా పనిచేసి కూడా.. కనీసం నిబంధనలను గౌరవించాలనే ఇంగితం లేకుండా వ్యవహరించారు. అయినా పోలీసులు వదలలేదు. చివరకు ఆయనే వెనక్కు తగ్గారు. అయితే వెలంపల్లి ఈ డ్రామా మొత్తం జగన్ కళ్లలో ఆనందం చూడడానికే నడిపించారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజున.. తన కారును అందరి కార్ల లాగే ఆపేస్తున్నందుకు.. గేటు వద్ద జగన్ గొడవ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నాయకుడి బాటలోనే తాము కూడా అడుగులు వేస్తున్నట్టుగా.. వెల్లంపల్లి ఎయిర్ పోర్టు వద్ద రభస చేయడం వివాదాస్పదం అవుతోంది.