వంశీ అరెస్టు: కుట్ర బయటపడిందని జగన్ దిగులు!

Monday, March 31, 2025

తాము చేసిన దుర్మార్గం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వాడిని బెదిరించి ప్రలోభ పెట్టి కిడ్నాపు చేసి ఆ ఫిర్యాదుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించడం అనేది సరికొత్త తెలివితేటలు! తన పార్టీకి వన్నె తెచ్చిన వల్లభనేని వంశీ అలాంటి సరికొత్త ఉపాయాన్ని అమలులో పెట్టేసరికి బహుశా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మురిసిపోయి ఉంటారు. చివరకు పోలీసులు.. సదరు కిడ్నాపు కుట్రలను సాక్ష్యాధారాల సహా బట్టబయలు చేసేసరికి.. తమ కుత్సితాలు ప్రజలకు అర్థమవుతుండేసరికి జగన్ అసహనానికి గురవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయడాన్ని జగన్ తీవ్రంగా తప్పు పడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా వ్యక్తం చేస్తున్న ఆవేదనను గమనిస్తోంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత  జగన్ అంటున్నారు. తీవ్రమైన అధికారం దుర్వినియోగం జరుగుతున్నదట! అయిదేళ్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించినప్పుడు.. చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఎంత మేర రాష్ట్రంలో పరిరక్షిస్తూ వచ్చారో.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ రీతిగా వేధించారో అందరూ చూశారు.

ఆపరేషన్ చేయించుకుని.. ఇంకా కుట్లు వేసిన పుండు కూడా ఆరని స్థితిలో ఉన్న అచ్చెన్నాయుడు ను శ్రీకాకుళం జిల్లానుంచి గుంటూరు దాకా రోడ్డు మార్గంలో తరలించారు. పట్టాభిని కస్టడీలో దుర్మార్గంగా హింసించారు. రఘురామక్రిష్ణ రాజుపై ఏకంగా హత్యాయత్నానికే ఒడిగట్టారు.. నన్ను చంపేసి.. గుండెపోటుతో చనిపోయినట్టుగా చిత్రీకరించాలనుకున్నారని ఆయన ఇప్పటికీ కేసు నడుపుతున్నారు. కొల్లు రవీంద్ర ఎలాంటి వేధింపులకు గురయ్యారో కూడా అందరికీ తెలుసు. వీటిలో ఏ కేసు కూడా వారికి బెయిలు వచ్చిన తర్వాత నిలబడలేదు. ఆ రకంగా ఒక హింసాత్మకమైన వ్యక్తిగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో ఒక్క వల్లభనేని వంశీని అరెస్టు చేసేసరికి.. గొంతుచించుకుని అరుస్తూ ఉంటే.. నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

సత్యవర్దన్ అనే తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉద్యోగిని కిడ్నాపు చేసి.. న్యాయమూర్తి దగ్గరకు తీసుకెళ్లి వాంగ్మూలం ఇప్పించిన వైనం.. ఇప్పుడు బయటపడేసరికి వైసీపీ దళాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. వంశీ అరెస్టు అక్రమం అంటూ పొలికేకలు పెడుతున్నాయి. నిజానికి వంశీకి అత్యంత సన్నిహితులు, ఆప్తులు అయిన కొందరు వైసీపీ నాయకులు బయటకువచ్చి ఒక్క మాట కూడా మాట్లాడడం  లేదు. తాము బయట కనిపిస్తే చాలు.. తమ పాపాల చిట్టా బయటకు వస్తుందని, తాము కూడా కేసుల్లో ఉండాల్సి వస్తుందని భయపడుతున్నారు. వైసీపీ దయనీయ పరిస్థితికి వంశీ అరెస్టు అద్దం పడుతోందని అంతా భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles