గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ- ఒక దళితుడి కిడ్నాప్, నిర్బంధం కేసుల్లో అరెస్టు అయి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండులో ఉన్నారు. నిజానికి ఆయన మీద ఉన్న అసలు నేరారోపణ కేసు ఇది కాదు. ఆయన మీద ఉన్న అసలు కేసుల్లో వ్యవహారం ఆయన అరెస్టు దాకా ఇంకా రానేలేదు. ఈలోగా ఆయన ఓవరాక్షన్ చేశారు. తన మీద ఉన్న కేసులను నీరుగార్చేందుకు కొత్త ఆలోచనతో కుట్రలు పన్ని, ఆ స్వయంకృతం కారణంగా ఇప్పుడు ఆయన జైలులో ఉన్నారు. ఈ కేసు, అరెస్టు కొసరుగా ఆయన కొనితెచ్చుకున్నది అన్నమాట. కాగా, ఆయన మీద ఉన్న అసలు కేసులో కూడా మరో అరెస్టు జరగడానికి ఇప్పుడు దారులు సుగమం అయ్యాయి.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి, విధ్వంసం, కార్ల దహనాలు వంటి సంఘటనల వెనుక అప్పటి వైసీపీఎమ్మెల్యే వల్లభనేని వంశీ హస్తం ఉన్నట్టుగా కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేశారే తప్ప.. పోలీసులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నిందితులను అరెస్టు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ కేసులను తిరగతోడారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను బట్టి వల్లభనేని వంశీపేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
ఇంతా కలిపి.. వంశీ మీద ఉన్న అసలు కేసు గన్నవరం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించినది. ఆ కేసులో తన పాత్ర లేదని నిరూపించుకోవడం కష్టం అవుతుందని వంశీ భయపడ్డారు. ఆ కేసులో తన అరెస్టు తప్పదని భావించిన ఆయన, ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇంకా తీర్పు వెలువడక ముందే ఆయన అతితెలివి ప్రదర్శించారు. పార్టీ ఆఫీసు మీద దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన పార్టీ ఆఫీసు ఉద్యోగి సత్వవర్ధన్ ను కిడ్నాపు చేసి నిర్బంధించి.. బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. కిడ్నాప్ బాగోతం బయటపడిన తర్వాత.. వంశీ అరెస్టు జరిగింది. ఆయన ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్నారు.
ఇప్పుడు ఆయన మీద ఉన్న అసలు కేసులో ముందస్తు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో దాడికేసులో మరోసారి వంశీని అరెస్టు చేయడానికి పోలీసులకు మార్గం సుగమం అయింది. కిడ్నాప్ కేసులో ఉన్న వంశీని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు ఒక పిటిషన్ వేసి ఉన్నారు. ఇంకా కస్టడీకి అప్పగించడం జరగలేదు. అది పూర్తయిన తరువాత.. పార్టీ ఆఫీసు మీద దాడికేసులో మరోసారి ఆయనను అరెస్టు చేసే అవకాశంఉన్నదని తెలుస్తోంది. దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని, ఇన్నాళ్లూ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉన్నందున ఆగారని, హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించినందున వంశీ మరోసారి అరెస్టు అవుతారని అంతా భావిస్తున్నారు.
వల్లభనేని వంశీ: మరో అరెస్టుకు దారులు ఈజీ అయ్యాయ్!
Sunday, April 6, 2025
