క్వాష్’ పప్పులుడకవని అర్థమైంది పాపం!

Friday, December 5, 2025

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే సామెత బహుశా ఇలాంటి వారిని చూసే పుట్టి ఉంటుంది. తాము చేసిన తప్పుడు పనులకు సంబంధించి.. ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తే.. నాయకులు ఎక్కడైనా సరే.. విచారణను ఎదుర్కొని తాము పరిశుద్ధులమని నిరూపించుకోవాలి. కోర్టు ఎదుటనైనా.. తమ సత్యసంధతను, నిజాయితీని నిరూపించుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. అలాకాకుండా.. అసలు కేసుకు తమకు సంబంధం లేదని వాదించుకుంటూ కోర్టు కెక్కడం కాస్త అతి అనిపించుకుంటుంది. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం అదే పనిచేస్తున్నారు. కేసు పెట్టగానే దానిని క్వాష్ చేయాలని, పూర్తిగా కొట్టేయాలని కోర్టు కెక్కడం.. అది సాధ్యం కాదని అర్థమైన తర్వాత.. వెనక్కు తగ్గి, ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది. ప్రస్తుతం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు.

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే భాస్కర రెడ్డి కొడుకు ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మూడున్నర వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును జగన్ దళాలు కాజేసిన అతిపెద్ద లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా నిందితుడు. ఒక కేసులో తండ్రీ కొడుకులు ఇద్దరూ నిందితులుగా ఉంటూ ఒకరకమైన అరుదైన రికార్డు సృష్టించారు. కాకపోతే.. గుట్టుచప్పుడు కాకుండా కొలంబోకు పారిపోవాలని చూసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోలీసులకు దొరికిపోయి ప్రస్తుతం రిమాండులో ఉండగా, మోహిత్ రెడ్డి ఇంకా విచారణకు కూడా హాజరుకాకుండా.. కోర్టు ద్వారా ఏమైనా ఉపశమనం దొరుకుతుందేమోనని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మద్యం స్కాం కేసులో నిందితుడిగా తన పేరు కొట్టివేయాలని, నిందితుడిగా తన పేరు ఉండగా, సాక్షిగా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం చెల్లదని మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి న్యాయమూర్తి గతంలోనే నిరాకరించారు. అంతభయం ఉంటే ముందస్తు బెయిలు పిటిషను వేసుకోవచ్చునని కూడా సూచించారు. దీంతో క్వాష్ పిటిషన్ ను ఉపసంహరించుకుని, ముందస్తు బెయిలు పిటిషన్ వేశారు.
అయితే క్వాష్, కుదరకపోతే బెయిల్ ప్రయత్నం అన్నట్టుగా వీరి తీరు ఉంది. మద్యం కంపెనీల నుంచి అవినీతి సొమ్మును వసూళ్లు చేసి ఒక చోట నిల్వపెట్టడం వరకు రాజ్ కెసిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, నిల్వ చేసిన సొమ్ములను బయటకు తరలించడంలో జగన్ అనుయాయులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్ధధారులని సిట్ తేల్చింది. అలాగే ఇలా నిల్వ చేసిన సొమ్మును ఎన్నికల అవసరాలకు తరలించి, వివిధ అభ్యర్థులకు చేర్చే బాధ్యత మొత్తం  చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తన అనుచరులు, కొడుకు సాయంతో చేసినట్టుగా సిట్ గుర్తించింది. ఈకేసులో సిట్ వాదనలు, వారు సేకరించిన ఆధారాలు చాలా బంలంగా కనిపిస్తున్న నేపథ్యంలో మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిలు కూడా అంత సులువు కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles