వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా కొన్ని షాక్ లు ఎదురుచూస్తున్నాయి. పార్టీలోని చాలా సీనియర్ నాయకుడు పార్టీ విధాన నిర్ణయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన అనుభవజ్ఞుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వైసీపీకి గుడ్ బై కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. శాసనమండలి పార్టీ నాయకుడిగా, మండలి ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని ఎంపిక చేసిన విషయంలో ఉమ్మారెడ్డి మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎంతో సీనియర్ నాయకుడు. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసినంతటి అనుభవజ్ఞుడు. ఆయన అల్లుడు కిలారి రోశయ్య గత ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మారెడ్డిని మాత్రం జగన్ ఎమ్మెల్సీ చేశారు. 2024 ఎన్నికలు వచ్చిన సమయానికి కిలారి రోశయ్యతో పార్టీ ఒక ఆట ఆడుకుంది. తొలుత ఆయనను పొన్నూరు నుంచి మరో నియోజకవర్గానికి మార్చారు. తర్వాత.. గుంటూరు ఎంపీ అన్నారు. ఆయన నాకు వద్దు మొర్రో అంటున్నా వినిపించుకోలేదు. గుంటూరు ఎంపీగా పోటీచేయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఆయన చాలా దారుణంగా ఓడిపోయారు. పార్టీ తనకు ద్రోహం చేసిందని భావించిన కిలారి రోశయ్య తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉండదని ఆరోపణలు చేశారు.
వైసీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని.. ఉమ్మారెడ్డి అనుభవాన్ని కూడా ఉపయోగించుకోలేదని అంటున్నారు. ఉమ్మారెడ్డికి తొలుత మండలి ఛైర్మన్ పదవి ఇస్తామని నమ్మబలికారని, చివరకు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చే అవకాశం వచ్చినప్పటికీ.. దానిని రెడ్డి వర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఇటీవలే జగన్ లేళ్ల అప్పిరెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నేరచరిత్ర ఉన్న వారు తప్ప మరెవ్వరూ దొరకలేదా అని బయట విమర్శలు వినిపిస్తుండగా.. ఆ నిర్ణయం పార్టీలో కొత్త ముసలం పుట్టించినట్టుగా కనిపిస్తోంది.
ఇవాళ కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు గానీ, త్వరలోనే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా పార్టీని వీడుతారని అంతా అంటున్నారు.
జగన్ కు గుడ్ బై కొట్డడానికి ఉమ్మారెడ్డి రెడీ!
Wednesday, January 22, 2025