వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడిగా విపరీతంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని.. రెండు చేతులూ అడ్డుపెట్టి కాపాడడం ఒక్కటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అవినాష్ రెడ్డిని ఎవ్వరు అనుమానించినా, ఆయనను ఎవ్వరు ఒక మాట అన్నా సరే.. వారందరూ దుర్మార్గులు, దుష్టులు, నీచులు అంటూ విరుచుకుపడిపోవడమే ఆయన నైజం. ఇలాంటి యావలో జగన్ కనీస విచక్షణ మరచిపోతున్నారు. నైతికతను పక్కన పెడుతున్నారు. హత్యకు గురైన వివేకానందరెడ్డి హత్య గురించి.. అత్యంత అసందర్భమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు.
మిగిలిన విషయాలను అన్నింటినీ పక్కన పెడదాం.. మరణించిన వివేకా గురించి.. ‘‘చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా కాదా? రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్నమాట వాస్తవమా కాదా?’ అంటూ ఎన్నికల ప్రచార సభలో బహిరంగ వేదిక మీదనుంచి మాట్లాడడం చాలా చవకబారు వ్యవహారంగా కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రజల్లో మెదలుతున్న సందేహం ఒక్కటే.. చిన్నాన్నకు రెండో భార్య ఉన్నారు సరే.. అయితే ఏమిటి? ఆయనకు సంతానం కూడా ఉన్నారు సరే.. అయితే ఏమిటి?
వివేకా తాను ఎంపీకావడానికి అడ్డుపడుతున్నాడని, కడప ఎంపీ టికెట్ షర్మిలకు ఇప్పించే ఉద్దేశంతో ఉన్నాడని అడ్డుగా భావించి అవినాష్ రెడ్డి ఆయనను చంపించేశాడు మొర్రో అని ఆయన కూతురు, షర్మిల కలిసి గగ్గోలు పెడుతోంటే.. ఆయన రెండో భార్య ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు?
అవినాష్ పసిబిడ్డ, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. పసిబిడ్డను హంతకుడిగా ముద్ర వేయడానికి అందరూ కుట్ర చేస్తున్నారు.. అని రకరకాల మాటలు అంటున్నారు సరే.. చంపినది ఎవరో చచ్చిపోయిన వివేకాకు, కనిపించని దేవుడికి తెలుసు అంటూ కల్లబొల్లి కబుర్లు ఎందుకు? జిల్లా ప్రజలు అందరికీ తెలుసు.. అంటూ వృథాడైలాగులు ఎందుకు? జిల్లామొత్తానికి తెలిస్తే వారి పేర్లేమిటో జగనే చెప్పవచ్చు కదా? ‘‘అవినాష్ కాదు- ఫలానా వాళ్లు హంతకులు’’ అని సింగిల్ డైలాగులో తేల్చేయకుండా.. వివేకా రెండో పెళ్లి సంగతిని బహిరంగ వేదిక మీద ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటి?
రెండు పెళ్లిళ్లు నేరమా? పాపమా? తమరి పార్టీలో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు ఎన్నికల బరిలో తలపడుతున్న వారు లేరా? పెళ్లి మాత్రం ఒకటే చేసుకుని, ప్రతిరోజూ ఒక కొత్త పెళ్లాన్ని కోరుకునే వారున్నారా లేరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ అనైతిక పోకడలకు, చవకబారు రాజకీయాలకు ఇది పెద్ద నిదర్శనం అని పలువురు విమర్శిస్తున్నారు. చిన్నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అనేది తన చెల్లెళ్ల మీద బ్రహ్మాస్త్రం లాగా, అవినాష్ రెడ్డి హంతకుడు కాదని నిరూపించడానికి రక్షణ కవచంలాగా ఆయన భావిస్తే అంతకుమించిన అమాయకత్వం ఉండదు. ఆయన పరువే పోతుందని ప్రజలు భావిస్తున్నారు.
చిన్నాన్నకు ఇద్దరు భార్యలా? అయితే ఏంటి జగన్!
Sunday, December 22, 2024